Gujarat elections 2022:


గుజరాత్ ఎన్నికల అభ్యర్థుల జాబితా..


గుజరాత్ ఎన్నికల్లో ఎవరు బరిలోకి దిగుతున్నారో బీజేపీ వెల్లడించింది. 160 మంది అభ్యర్థులను భాజపా ప్రకటించింది. భాజపా అభ్యర్థుల జాబితాలో 38 కొత్త ముఖాలు ఉన్నాయి. 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశమిచ్చింది. గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అందరూ భావిస్తున్న మోర్బి నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టేసింది బీజేపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతీయకు అవకాశమిచ్చింది బీజేపీ అధిష్ఠానం. ఆయన ఎందుకంత స్పెషల్ అంటారా..? మోర్బి వంతెన కూలిన సమయంలో అందరూ చూస్తుండగానే నీళ్లలోకి దూకి కొందరి ప్రాణాలను కాపాడారు కాంతిలాల్. ఈ ప్రమాదం జరిగినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులందరూ ఇదే విషయాన్ని చెప్పారు. ఫలితంగా...బీజేపీ వ్యూహాత్మకంగా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. సెంటిమెంట్ వర్కౌట్ అయితే..ఆయన గెలవటం కష్టమేమీ కాకపోవచ్చు. నిజానికి బీజేపీ ఈ సారి చాలా మంది కొత్త వాళ్లకు అవకాశమిచ్చింది. సీనియర్ నేతలనూ పక్కన పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ నిరాశే మిగిలింది. అయితే..కొందరు సీనియర్ నేతలు తమకు తాముగానే పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాళ్లు ఆసక్తి చూపలేదు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ లిస్ట్‌లో ఉన్నారు. దాదాపు 8 మంది మాజీ మంత్రులు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ జామ్‌నగర్ నార్త్ విధానసభ స్థానం టికెట్ ఆమెకు ఇచ్చింది. రివాబా 2019లోనే భాజపాలో చేరారు. 






విచారణ వేగవంతం..


మోర్బి వంతెన కూలిన ఘటనలో విచారణ వేగంగా సాగుతోంది. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం వల్ల పోలీసులు వీలైనంత వేగంగా విచారణ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ బాధ్యతలు చూసుకుంటున్న మేనేజర్‌ సహా ఇతర సిబ్బందిని ఇప్పటికే విచారించారు. ఆ తరవాత మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ సందీప్ సింగ్‌ను విచారించారు. దాదాపు 4 గంటల పాటు ఇది కొనసాగింది. స్థానిక కంపెనీ Orevaతో కుదిరిన ఒప్పందంపై ప్రశ్నించారు పోలీసులు. ఆ తరవాత లోకల్ కోర్ట్‌కు ఈ విచారణకు సంబంధించినడాక్యుమెంట్లు సమర్పించారు. ఇందులో తేలిందేంటంటే...ఈ బ్రిడ్జ్ మరమ్మతుల కోసం ఓ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అయితే...ఈ కాంట్రాక్టర్లకు బ్రిడ్జ్‌ను మరమ్మతు చేయటమెలాగో పూర్తి స్థాయిలో అవగాహన లేనే లేదు. అంతకు ముందెన్నడూ వాళ్లు అలాంటి పనులు చేయలేదు. కేవలం బ్రిడ్జ్‌కు ఉన్న కేబుల్స్‌ను పాలిష్ చేసి పెయింటింగ్ చేసి వదిలేశారు. ఈ కంపెనీ ఈ బ్రిడ్జ్‌ రిపేర్ చేయడానికి పూర్తిగా అనర్హం అని విచారణలో తేలింది. ఎన్నికల ముందు ఈ ప్రమాదం జరగటం వల్ల ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం పడుతుందని అంతా భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఇదో మచ్చలా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే...విచారణ వేగంగా సాగుతుండటంతో పాటు ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని ప్రభుత్వం హామీ ఇస్తోంది. 


Also Read: Gujarat Election 2022: బీజేపీని ఆ వర్గం కరుణిస్తుందా? కలవర పడుతున్న కమలం