Gujarat Election 2022: 


పాటిదార్‌ల అండ ఉండాల్సిందే..


గుజరాత్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు నిర్ణయించే వర్గం పాటిదార్. 2017లో హార్దిక్ పటేల్ నేతృత్వంలో ఈ వర్గం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. రిజర్వేషన్‌ కావాలంటూ నినదించింది. ఆ సమయంలో జరిగిన ఎన్నికల పైనా ఈ ప్రభావం పడింది. భాజపా కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఈసారి కూడా ఆ ప్రభావం పడుతుందేమోనని కాస్త కలవర పడుతోంది బీజేపీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాలకు పరిమితమైంది కాషాయపార్టీ. విజయం సాధించినప్పటికీ సీట్లు తగ్గుతుండం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. అయితే...అప్పట్లో ముందుండి ఉద్యమాన్ని నడిపిన హార్దిక్ పటేల్ ఇప్పుడు బీజేపీలో చేరారు. ఈసారి ఆయనకు టికెట్ కూడా దక్కుతుందని తెలుస్తోంది. ఇది కొంత మేర పార్టీకి ఊరటినిచ్చేదే అయినా...పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. హార్దిక్ పటేల్‌కు టికెట్ ఇస్తే ఆ వర్గం ఓట్లు పెద్ద ఎత్తున పడతాయని అంచనా వేస్తోంది. ఇలా అయినా...గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధించుకోవాలని పట్టుదలతో ఉంది. 


71 సీట్లలో ప్రభావం..


గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో దాదాపు 71 సీట్లలో పాటిదార్‌ల ప్రభావం తప్పకుండా ఉంటుంది. దాదాపు 52 నియోజకవర్గాల్లో 20% కన్నా ఎక్కువ మంది పాటిదార్‌ వర్గానికి చెందిన వారున్నారు. అంటే...ఆ ఓట్లు ఏ పార్టీకి పడితే ఆ పార్టీ విజయం ఖాయం అయినట్టే లెక్క. దక్షిణ గుజరాత్‌తో పాటు సౌరాష్ట్రలో వీరి ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ఇందుకు ఉదాహరణ కూడా ఇస్తున్నారు విశ్లేషకులు. 2017లో పాటిదార్ ఉద్యమం జరిగినప్పుడు సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో బీజేపీకి చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు పడ్డాయి. ఈ ప్రాంతంలో మొత్తం 54 నియోజకవర్గాలుండగా...బీజేపీ కేవలం 23 చోట్ల విజయం సాధించింది. గుజరాత్‌ మొత్తం జనాభా 6 కోట్ల 30 లక్షలు. ఇందులో 14% పాటిదార్‌లే. ఇక ఓటర్‌ల పరంగా చూస్తే...21% వీరే ఉంటారు. పాటిదార్‌ వర్గంలో మళ్లీ రెండు ఉప శాఖలుంటాయి. ఒకటి లీవా పటేల్ కాగా మరోటి కడ్వా పటేల్. వీరిలో 70% లీవా పటేల్‌లు ఉండగా...30% మంది కడ్వా పటేల్‌లు ఉంటారు.  


ఐడెంటిటీ అస్త్రం..? 


భాజపా అమ్ముల పొదిలో ఉన్న అస్త్రం "గుజరాత్ ఐడెంటిటీ". అంటే స్థానికత పేరు మీద ఓట్లు అడుగుతుంది. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావటం వల్ల ఈ ఐడెంటిటీ కార్డ్‌ని తప్పకుండా వినియోగిస్తుంది. ఎవరు స్థానికులు, ఎవరు బయటి వాళ్లు అనే ఎమోషన్‌ను ప్రజల్లో తీసుకురాగలిగితే....అది కచ్చితంగా భాజపాకే ప్లస్ అవుతుంది. ఫలితంగా....ప్రతిపక్షాలు డిఫెన్స్‌లో పడిపోవాల్సి వస్తుంది. 1985లో కాంగ్రెస్ 185 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఈ రికార్డ్‌ను మళ్లీ ఎవరూ తిరగరాయలేదు. ఈ ఎన్నికల్లో తాము ఈ రికార్డ్‌ను అధిగమి స్తామని భాజపా చాలా ధీమాగా చెబుతోంది. కానీ..రెండు దశాబ్దాలుగా భాజపా అధికారంలో ఉండటం వల్ల ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండకపోదు. 


Also Read: ABP-C voter Survey: గుజరాత్‌లో గెలుపెవరిది? కమల వికాసమా లేక కాంగ్రెస్ ప్రభంజనమా?