Aruna Miller Lieutenant Governor:


మేరిలాండ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా విజయం..
 
భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో భిన్న రంగాల్లో తమ సేవలు అందిస్తున్నారు. ఇందుకు రాజకీయాలూ అతీతమేమీ కాదు. బ్రిటన్‌లో ఇటీవలే భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని అయ్యారు. అమెరికాలోనూ కొందరు భారతీయులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు మరో మహిళ..అమెరికాలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఇండియన్ అమెరికన్ అరుణ మిల్లర్ మేరీలాండ్‌కు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. అమెరికాకు వలస వచ్చి ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. నిన్న జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆమె ఎల్‌జీగా గెలుపొందారు. విజయం సాధించిన వెంటనే అరుణ మిల్లర్ ట్విటర్‌ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "నన్ను గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు. మీ నిబద్ధతకు, మద్దతుకి కృతజ్ఞతలు" అని ట్వీట్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ భారత సంతతికి చెందిన వారే. ఇప్పుడు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ హోదాలోనూ మన ఇండియన్స్‌ రాణించటం గొప్ప విషయమే. 










ఎవరీ అరుణ మిల్లర్ (Who is Aruna Miller)


1. డెమొక్రటిక్ పార్టీకి చెందిన అరుణ మిల్లర్ (58) మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆమెకు ఏడేళ్ల వయసున్నప్పుడు కుటుంబమంతా అమెరికాకు వలస వెళ్లింది. 
2.1989లో మిస్సౌరీ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. మాంట్‌గోమేరీ కౌంటీలోని లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్‌ విభాగంలో దాదాపు 25 ఏళ్ల పాటు పని చేశారు. 
3. 2010-18 వరకూ మేరీలాండ్‌లోని డిస్ట్రిక్ట్ 15 తరపున హౌస్‌ ఆఫ్ డెలిగేట్స్‌లో ప్రాతినిధ్యం వహించారు. 
4. 2018లో జరిగిన మేరీలాండ్ ఆరో Congressional Districtలో పోటీ చేశారు. 8 మంది అభ్యర్థుల్లో రెండో స్థానంలో నిలిచారు. 
5. డేవ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు అరుణ మిల్లర్. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి Montgomery Countyలో నివసిస్తున్నారు. 


బరిలో ఇండియన్ అమెరికన్లు..


అమెరికా రాజకీయ విశ్లేషకులు ముందుగానే ఈ విజయాన్ని ఊహించారు. ఇండియన్ అమెరికన్లకు 100% గెలిచే అవకాశముందని చెప్పారు. డెమొక్రటిక్ పార్టీ నుంచే మరో నలుగురు ఇండియన్ అమెరికన్లు బరిలోకి దిగారు. ప్రస్తుతానికి నలుగురు సిట్టింగ్ ఎంపీలు మరోసారి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిలో అమి బేర, రాజా కృష్ణమూర్తి, ఆర్‌వో ఖన్నా, ప్రమీల జైపాల్‌ ఉన్నారు. వీరితో పాటు ఈ సారి బడా వ్యాపారి శ్రీ తనేదర్ కూడా ఈ సభకు ఎన్నికవుతారని అంతా అంచనా వేస్తున్నారు. మిచిగన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌ నుంచి ఆయన పోటీ చేశారు. అయితే...ప్రస్తుతం భారత సంతతికి చెందిన ఎంపీల్లో  అమీ బేర చాలా సీనియర్. కాలిఫోర్నియాలోని సెవెంత్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆరోసారి ఆయన పోటీ చేశారు. వీరితో పాటు ఖన్నా, కృష్ణమూర్తి, జైపాల్ నాలుగో సారి House of Representatives మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడి రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం చూస్తే...రిపబ్లికన్ అభ్యర్థులతో పోల్చి చూస్తే..ఈ నలుగురూ రాజకీయంగా బలంగాఉన్నారు. 


Also Read: US Midterm Polls: బైడెన్ మాకు నచ్చటం లేదు, మరోసారి అధ్యక్షుడు అవడానికి వీల్లేదు - ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలన నిజాలు