US Midterm Polls:
మధ్యంతర ఎన్నికలు..
అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్ ముగిసింది. వీటి ఫలితాలపైనే ఉత్కంఠ పెరుగుతోంది. వచ్చే అధ్యక్ష ఎన్నికల ఫలితాలపైనా ప్రభావం చూపించగలిగే ఈ మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు అక్కడి పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశాన్ని ద్రవ్యోల్బణం వెంటాడుతోంది. కరోనా తరవాత అమెరికా స్థితిగతులు కాస్త గాడి తప్పాయి. వీటితో పాటు తుపాకుల దాడులు, నేరాల పెరుగుదల, అక్రమ వలసలు లాంటి సమస్యలూ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. వీటిపైనే ఆచితూచి ఆలోచించాకే..ఓటర్లు తమ అభిప్రాయాలను ఓటు రూపంలో తెలియజేసి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ కొన్ని షాకింగ్ నిజాలు వెల్లడించారు. అమెరికన్లు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పాలనలో సంతృప్తిగా లేరని అందులో తేలింది. మరోసారి ఆయనకే అధ్యక్ష పదవి దక్కాలన్న ఆలోచనలో ఎవరూ లేరని తెలుస్తోంది. Edison Research వెల్లడించిన వివరాల ప్రకారం...అబార్షన్ విషయంలో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రతి 10 మంది ఓటర్లలో ఆరుగురు అసంతృప్తిగానో, ఆగ్రహంగానో ఉన్నారు. అబార్షన్ అనేది చట్టబద్ధంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 10 మంది ఓటర్లలో ముగ్గురు "ద్రవ్యోల్బణం, అబార్షన్‌పై తీర్పు" అంశాలే తమను ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్ననేరాలపైనా కొందరు అసంతృప్తిగా ఉన్నారు.
అసంతృప్తి..
ప్రతి 10 మందిలో ఒక్కరు నేరాలు, గన్ పాలసీ, అక్రమ వలసలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక Edison Exit Pollలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి 10 మంది పౌరుల్లో ఏడుగురు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని భావిస్తున్నారు. రెండోసారి బైడెన్ అధ్యక్షుడు అవడం తమకు ఇష్టం లేదని ప్రతి 10 మందిలో ఏడుగురు కుండ బద్దలు కొట్టేస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌ని బట్టి చూస్తే..అధ్యక్షుడు బైడెన్‌పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని స్పష్టమవుతోంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో గెలిస్తేనే...రానున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు సాధ్యపడుతుందని నమ్ముతారంతా. ఇప్పుడు ఈ ఎన్నికల్లోనే బైడెన్‌పై వ్యతిరేకత కనిపించటం సంచలనం కలిగిస్తోంది.
పోటీ చేస్తానంటున్న ట్రంప్..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు అవే సంకేతాలిస్తున్నాయి. 2024లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు ట్రంప్. ఓ మీటింగ్‌కు హాజరైన ఆయన..."తరవాతి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా" అన్న ప్రశ్నకు "తప్పకుండా చేస్తాను" అని సమాధానిచ్చినట్టు BBC రిపోర్ట్ చేసింది. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ఆయన ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే..ఈలోగా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎలక్షన్‌లో ప్రస్తుత ప్రభుత్వంపై అక్కడి ప్రజల అభిప్రాయమేంటే కచ్చితంగా తెలుస్తుంది. ఇందులోని ఫలితాలు...అధ్యక్ష ఎన్నికలనూ ప్రభావితం చేస్తాయి. పూర్తిగా అక్కడి రాజకీయాలు మారిపోయే అవకాశమూ ఉంది.
Also Read: COP27 Event: రిషి చర్యలు ఊహాతీతం- బ్రిటన్ ప్రధాని అంత హడావిడిగా ఎక్కడికి వెళ్లినట్లు?