Cardless Cash Withdrawal: ప్రజా దైనందిన జీవితంలో ATM ఒక భాగంగా మారింది. ఒకవేళీ మీరు మీ డెబిట్ కార్డు లేదా ATM కార్డ్‌ను మర్చిపోయి, డబ్బుల కోసం ATM దగ్గరకు వెళితే డీలా పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు, డెబిట్ కార్డ్ లేదా ATM కార్డ్‌ లేకుండానే డబ్బు విత్‌డ్రా చేసుకుని సంతోషంగా తిరుగుముఖం పట్టవచ్చు. 


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆదేశాల ప్రకారం, దేశంలోని చాలా బ్యాంకులు ATM కార్డుతో సంబంధం లేకుండా ATM నుంటి నగదు తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కొత్త సదుపాయం ప్రకారం, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ 
(UPI) ఉపయోగించి 'ATM కార్డ్‌ లెస్ క్యాష్‌ విత్‌డ్రా' చేసుకోవచ్చు. దీనివల్ల ATM కార్డ్‌ మోసాలు తగ్గుతాయి. స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్, డివైజ్ ట్యాంపరింగ్ వంటి మోసాలను నిరోధించవచ్చు. 


కార్డ్‌లెస్ క్యాష్‌ విత్‌డ్రా: UPI ద్వారా కస్టమర్‌లు నగదును ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చు?


మొదటి మార్గం:


1. UPI ద్వారా ATM నుంచి నగదు ఉపసంహరణ కోసం ముందుగా ATM మెషీన్‌లో 'రిక్వెస్ట్‌ డిటెయిల్స్‌' నింపండి.
2. ఈ వివరాలు నింపిన తర్వాత మీకు ఒక QR కోడ్ జనరేట్ అవుతుంది.
3. తర్వాత మీరు మీ మొబైల్‌ ఫోన్‌లోని UPI యాప్‌ని తెరిచి, ఆ QR కోడ్‌ని స్కాన్ చేయాలి.
4. స్కాన్ చేసిన తర్వాత మీ అభ్యర్థనకు ఆమోదం వస్తుంది.
5. ఆ తర్వాత మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్‌ చేయాలి. ఇప్పుడు మీరు ATM నుంచి నగదు తీసుకోవచ్చు.


రెండో మార్గం:


1. ATM మెషీన్‌లో UPI IDని ఎంటర్ చేయండి.
2 తర్వాత, విత్‌డ్రా చేయాల్సిన మొత్తాన్ని ఎంటర్‌ చేయండి
3. ఆ తర్వాత మీ UPI యాప్‌లో మీకు ఒక రిక్వెస్ట్‌ కనిపిస్తుంది, దానిని నింపండి.
4. UPI యాప్‌లో పిన్‌ ఎంటర్‌ చేయడం ద్వారా రిక్వెస్ట్‌ను ఆమోదించాలి.
5. అంతే, ATM నుంచి నగదు బయటకు వస్తుంది.


ఒకవేళ మీరు HDFC బ్యాంక్‌ కస్టమర్‌ అయితే ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి. HDFC బ్యాంక్‌ డెబిట్/ATM కార్డ్ లేకుండా, రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ATM నుంచి నగదును సులభంగా ఎలా విత్‌డ్రా చేయవచ్చు అన్న వివరాన్ని బ్యాంక్‌ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.:


1. ముందుగా, మీరు HDFC బ్యాంక్ నెట్‌ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్ ఫండ్స్‌పై క్లిక్ చేయండి.
2. ఇప్పుడు కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా మీద క్లిక్ చేయండి.
3. ఇక్కడ డెబిట్ ఖాతాను ఎంచుకుని, లబ్ధిదారుల వివరాల ఎంపికకు వెళ్లి, 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.
4. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి. ఇది కార్డ్‌లెస్ విత్‌డ్రా అభ్యర్థన పంపుతుంది.
5. కార్డ్‌లెస్ క్యాష్‌ విత్‌డ్రా అభ్యర్థన 24 గంటల పాటు చెల్లుబాటులో ఉంటుంది.
6. ఇప్పుడు HDFC బ్యాంక్ ATMకు వెళ్లండి. ATM స్క్రీన్‌ మీద కనిపించే కార్డ్‌లెస్ క్యాష్ ఆప్షన్‌ ఎంచుకోండి.
7. మొదటి OTPని, ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌ను, 9 అంకెల ఆర్డర్ ఐడీని, కావాల్సిన డబ్బును ఎంటర్‌ చేయండి.
8. ఈ వివరాలు సరిపోలగానే ATM నుంచి డబ్బు బయటకు వస్తుంది.


HDFC బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, రోజుకు రూ.100 నుంచి రూ.10,000 వరకు కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణలు చేయవచ్చు. ఈ మొత్తం ఒక నెలలో రూ. 25,000 దాటకూడదు.