Morgan Stanley India GDP: మరో ఐదేళ్లలో, అంటే 2027 నాటికి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని, మూడో అతి పెద్ద స్టాక్ మార్కెట్‌గానూ నిలుస్తుందని.. గ్లోబల్‌ బ్యాంకర్‌ మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) అంచనా వేసింది. ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ & ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను అమెరికాకు చెందిన ఈ మల్టీ నేషనల్‌ బ్యాంకర్‌ అందిస్తుంది. 


వచ్చే పదేళ్లలో, మొత్తం ప్రపంచ ఆర్థిక వృద్ధిలో ఐదో వంతు భారత్‌దేనని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. విస్తృతంగా పెరుగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం, వృద్ధిలో వేగం ప్రధాన కారకాలుగా పని చేస్తాయని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ తెలిపింది.


'వై దిస్ ఈజ్ ఇండియాస్ డికేడ్' (Why This Is India's Decade) పేరుతో రూపొందించిన నివేదికలో భారత దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే విధానాల గురించి వివరించింది.


పదేళ్లలో జీడీపీ రెట్టింపు
ఈ నివేదిక ప్రకారం... భారతదేశ GDP ఒక దశాబ్దంలో ప్రస్తుత $3.4 ట్రిలియన్ల నుంచి $8.5 ట్రిలియన్లకు రెట్టింపు అవుతుంది. భారతదేశం తన GDPకి ప్రతి సంవత్సరం $400 బిలియన్లకు పైగా జోడిస్తుంది. ప్రపంచంలో ఇప్పటివరకు అమెరికా, చైనా మాత్రమే ఇలా చేయగలిగాయి.


2027 నాటికి, భారత్‌ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, మూడో అతి పెద్ద స్టాక్ మార్కెట్‌గా మార్చేందుకు అవసరమైన పరిస్థితులన్నీ సిద్ధంగా ఉన్నాయని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. 


2032 నాటికి భారతదేశ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్ లేదా GDP) ప్రస్తుత $3.4 ట్రిలియన్ల నుంచి $11 ట్రిలియన్లకు, అంటే మూడు రెట్లకు పైగా పెరుగుతుందని అంచనా వేసింది. ఇది జరిగితే, అప్పుడు కూడా మూడో అతి పెద్దది ఆర్థిక వ్యవస్థగా నిలబడుతుందని వెల్లడించింది.


భారతదేశంలో కనిపిస్తున్న ఈ మార్పును "ఒక తరంలో ఒక్కసారి మాత్రమే కనిపించే మార్పు ఇది, పెట్టుబడిదారులు & కంపెనీలకు సువర్ణ అవకాశం" అని తన నివేదికలో మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది.


నాలుగు ప్రధాన అంశాలైన జనాభా, డిజిటలీకరణ, కర్బన ఉద్గారాల తగ్గింపు, ప్రపంచీకరణ భారతదేశ పెరుగుదలలో వేగాన్ని మరింత సులభంగా మార్చే అవకాశం ఉంది.


పెరగనున్న ప్రజల ఆదాయం
నివేదిక ప్రకారం.. సంవత్సరానికి $35,000 (రూ. 28,44,469) కంటే ఎక్కువ సంపాదించే కుటుంబాల సంఖ్య వచ్చే పదేళ్లలో ఐదు రెట్లు పెరుగుతుంది. తద్వారా, ప్రజల ఆర్థిక స్థోమత, వినియోగం పెరుగుతాయి.


భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుత $2,278 నుంచి 2031లో $5,242కి పెరుగుతుందని మోర్గాన్‌ స్టాన్లీ లెక్క వేసింది.


వస్తు, సేవల పన్ను ‍‌(GST) ద్వారా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్‌ను సృష్టించడం, కార్పొరేట్ పన్నులు తగ్గింపు, దేశంలో-విదేశాల్లో పెట్టుబడులు ప్రోత్సహించడానికి ఉత్పత్తి అనుసంధాన పథకాలను (PLI schemes) ప్రవేశ పెట్టడం వంటివి భారత దేశ భవిష్యత్‌ వృద్ధికి స్పష్టమైన ఉదాహరణలుగా మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది.


అయితే, దేశీయ & అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఈ అంచనాలు ఫలిస్తాయని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉద్యోగ సృష్టిని పెంచేలా ప్రభుత్వ విధానాల్లో మరింత మార్పు అవసరమని తెలిపింది.