Rains in Telangana AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర శ్రీలంక, తమిళనాడు వైపుగా వస్తున్న అల్పపీడనం ప్రభావం మరింత ప్రభావవంతంగా మారనుంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడుకు నవంబర్ 11న వస్తుంది, దీని ప్రభావంతో అదే రోజు నుంచి ఏపీలో వర్షాలు కురవనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ నేడు, రేపు ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా మారిపోయింది. తెలంగాణలో ఎక్కడా వర్షాలు కురవడం లేదు. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు మాత్రం పడుతున్నాయి. వాతావరణశాఖ చెప్పినట్లుగానే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. దీని ప్రభావం మరో రెండు రోజుల తరువాత ఏపీలో కనిపిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శ్రీలంక తీరం వెంట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆపై వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా నమోదవుతుండగా.. రాత్రివేళ చలి తీవ్రత అధికంగా ఉంది. పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులపాటు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ లో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 34.8 డిగ్రీలు నమోదు కాగా, హకీంపేటలో అత్యల్పంగా 16 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నవంబర్ 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు, మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.
హైదరాబాద్ లో చలి తీవ్రత పెరుగుతోంది. ఆకాశం పాక్షికంగా మేఘాలతో కప్పేసి ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి గంటకు 3 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11, 12, 13 తేదీలల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మాత్రం తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు పడతాయి. ముఖ్య నగరాలైన వైజాగ్, విజయవాడలో అల్పపీడనం అంతగా ప్రభావం చూపకపోవచ్చు. నవంబర్ 12 నుంచి 15 తేదీల్లో ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గాలులు వీచడంతో చలి తీవ్రత పెరుగుతోంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నాయి. నేడు ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వాతావరణం పొడిగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఈ ప్రాంతాల్లో నవంబర్ 11 నుంచి మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 14 నుంచి వర్షాలు 16 తేదీలలో క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. అత్యధిక వర్షాలు తిరుపతి, నెల్లూరు జిల్లాలలో ఉంటాయి.
నవంబర్ 12 నుంచి అల్పపీడనం ప్రభావం తిరుపతి, నెల్లూరు జిల్లాలతో పాటుగా కడప, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల మీదుగా ఉండనుంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో 13న వర్షాలు కురవనున్నాయి. ఆ సమయానికి అల్పపీడనంగా బలహీనపడి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతంలో ఉన్న తేమను లాగుతుంది. నవంబర్ 14 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షాలుంటాయి. నవంబర్ 12 నుంచి 16 తేదీలలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మాత్రం తేలికపాటి తుంపర్లు, కొద్ది సేపు వర్షాలు పడతాయి. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండవు.