Pawan Kalyan :  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు అంటూ సాగిన ఈ వీడియోలో పవన్ ఇలా అన్నారు. "మనల్ని పరిపాలించిన రవి అస్తమించని బ్రిటీష్ దేశానికి భారతీయ సంతతికి చెందిన రుషి సునాక్ ప్రధాన మంత్రి అవగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు... ఏపీలో ఇంకా ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు మిగతా వాళ్లను ఎందుకు రానివ్వరు? ఎంత కాలం రానివ్వకుండా ఉంటారు. భారత దేశం స్వతంత్రం సంపాదించుకుని మనం చేసిన అద్భుతం ఏంటంటే- పంచాయతీ ఎన్నికల్లో అణగారిన వర్గానికి చెందిన ఒకరు స్వేచ్ఛగా నేను నామినేషన్ వేద్దాం ఓట్లు వచ్చినా రాకున్నా అనుకొనే పరిస్థితి లేదు. దీని గురించి ఏమనాలి? బ్రిటీష్ వాడు వదిలి వెళ్లిపోయినా ఇంకా ఊడిగం ఎవరికి చేస్తాం. నామినేషన్ వేసే అర్హత కూడా నీకు లేదని భయపెట్టేస్తుంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు... ఏ రోజా అని ఎదురుచూస్తున్నా." అని పవన్ అన్నారు. 






ఇప్పటం  గ్రామస్థులకు అండగా జనసేనాని 


ఇప్పటం గ్రామంలో ఇటీవల ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను తొలగించిన వ్యవహరంలో జనసేన అధిత పవన్ కళ్యాణ్ ఉదారంగా స్పందించారు. ఇళ్లు దెబ్బతిన్నవారు, ఆవాసాలు కోల్పోయిన వారికి కుటంబానికి రూ.1 లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఇటీవల పవన్ బాధితులను పరామర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో కూల్చి వేతలు జరిగిన 24 గంటల లోపే బాధితులకు పరామర్శించి అండగా ఉంటామని, భరోసా ఇచ్చిన పవన్.. ఇప్పడు తాజాగా ఆర్థిక  సహాయాన్ని కూడా ప్రకటించారు.


ఇళ్లు కూల్చివేత 


 జనసేన సభ నిర్వాహణ వేదిక దొరకని పరిస్దితుల్లో పవన్ కళ్యాణ్ కు సభ పెట్టుకోవటానికి గ్రామస్థులు స్థలాన్ని అందించారు. మార్చి 14  తేదీన ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టి శుక్రవారం జె.సి.బి.లను పెట్టి, పోలీసులను మోహరింపచేసి ఇళ్ళు కూల్చివేశారని జనసేన నేతలతో పాటు ఇప్పటం ప్రజలు ఆరోపించారు. ఈ సంఘటన  ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కూల్చివేత జరిగిన మరునాడే పవన్ కళ్యాణ్ ఇప్పటం సందర్శిం బాధితులను పరామర్శించారు. ఇళ్ళు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని  ఇప్పటంవాసుల గుండె నిబ్బరాన్ని  చూసి చలించిపోయారు. బాధితులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు. నైతిక మద్దతుతోపాటు ఆర్ధికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను  ఇప్పుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా అందచేస్తారు. ఈ మేరకు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.   


అప్పుడు 50 లక్షలు.... ఇప్పుడు 53 లక్షలు


జనసేన పార్టి ఆవిర్బావ సభను నిర్వహించేందుకు పార్టీ నాయకులు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో అనేక స్దలాలను పరిశీలించారు. అయితే అధికార పార్టీ వైసీపీ నుంచి ఒత్తిళ్లు రావడం, ప్రతికూల పరిస్థితుల్లో జనసేన సభకు స్థలం దొరకలేదు. దీంతో విజయవాడకు సమీపంలోని ఇప్పటం గ్రామస్తులు పవన్ సభకు అవసరం అయిన స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. గ్రామంలో పది మంది రైతులు తమ 14ఎకరాల స్దలాన్ని పవన్ సభ నిర్వాహణకు అందించారు. దీంతో పవన్ వారిని అభినందించి, గ్రామ సంక్షేమం కోసం 50 లక్షల రూపాయలు ప్రకటించారు. ఇప్పుడు కూడా పవన్ అదే ఉదారతను చాటుకున్నారు. జనసేన సభకు స్దలాన్ని ఇవ్వటం ద్వార ప్రభుత్వ వేదింపులకు గురి అయిన బాధితులకు అండగా నిలబడ్డారు. అప్పుడు గ్రామానికి రూ.50 లక్షలు అందించిన పవన్ తాజాగా మొత్తం 53 ఇళ్ల బాధితులకు లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.53 లక్షలు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.