Ayyanna Highcourt :  తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడుకి హైకోర్టులో ఊరట లభించింది. తనపై సీఐడీ నమోదు చేసిన ఫోర్జరీ కేసు అక్రమం అని.. రాజకీయ కక్ష సాదింపు అని ఆ కేసును కొట్టి వేయాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.  ఆ తీర్పును బుధవారం హైకోర్టు వెలువరించింది. సీఐడీ విచారణ కొనసాగించుకోవచ్చు కానీ.. ఈ కేసు  విషయంలో ఆయనపై పెట్టిన సెక్షన్ 467 వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. జల వనరుల శాఖ ఇచ్చిన ఎన్వోసీ.. విలువైన పత్రాల కేటగిరి కిందకు రాదని స్పష్టం చేసింది. ఈ సెక్షన్ వర్తించనందున.. సీఆర్సీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని స్పష్టం చేసింది.


సెక్షన్లు చెల్లవన్న హైకోర్టు - విచారణ కొనసాగింపునకు అనుమతి 


అయన్నపాత్రుడుని అరెస్ట్ చేసి..  విశాఖలోని న్యాయస్థానం ముందు హాజరు పర్చినప్పుడు న్యాయమూర్తి రిమాండ్  కు పంపడానికి నిరాకరించారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని.. సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని స్పష్టం చేసింది. అయన్న పాత్రుడు, ఆయన కుమారులు నీటి పారుదల శాఖ ఈఈ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. రెండు సెంట్ల స్థలానికి ఎన్వోసీ తీసుకున్నారని సీఐడీ పోలీసులు మూడో తేదీన కేసు నమోదు చేశారు. అదే రోజున తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడు రాజేశ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. 


మూాడో తేదీన తెల్లవారుజామున అయ్యన్న, ఆయన కుమారుడ్ని అరెస్ట్ చేసిన సీఐడీ 


కేసులో మరో కుమారుడు విజయ్ పేరు ఉన్నప్పటికీ ఆయన ఇంట్లో లేకపోవడంతో అరెస్ట్ చేయలేదు. అదే రోజు సాయంత్రం విశాఖ కోర్టులో ప్రవేశ పెట్టారు కానీ... ఆ సెక్షన్లు చెల్లని కారణంగా బెయిల్ లభించింది. అయితే సీఐడీ అధికారులు రాజకీయ కుట్రతోనే... ఈ కేసులు నమోదు చేశారని.. తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో అయ్యన్న కుమారుల పేరుపై ఉందని.. కానీ అయ్యన్న పాత్రుడిని ఏ - వన్‌గా చూపించడం కుట్రేనని ఆరోపిస్తున్నారు. సంతకం ఫోర్జరీ అయిందనేది అబద్దమని.. గతంలో ఎన్వోసీ ఇచ్చిన అధికారులను బెదిరించి ఇలాంటి ఫిర్యాదులు ఇప్పిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


సెక్షన్లు మార్చి  సీఆర్పీసీ నోటీసులు జారీ చేయనున్న సీఐడీ 


అయ్యన్న పాత్రుడిపై ఇప్పటికి పలు రకాల కేసులు పెట్టారు. దాదాపుగా పది కేసులు పెట్టారు. పలుమార్లు అరెస్టు చేయడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ ఫోర్జరీ కేసులో మాత్రం అరెస్టు చేసినప్పటికీ రిమాండ్‌కు తరలించలేకపోయారు. ఈ కేసు విషయంలో విచారణ కొనసాగించుకోవచ్చని  హైకోర్టు చెప్పడంతో ఈ కేసులో సీఐడీ పోలీసులు సెక్షన్లు మార్చి.. వారికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించాల్సి ఉంది.