CJI DY Chandrachud: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ (CJI DY Chandrachud) ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు.
సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో పాటు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది.
రెండేళ్ల పాటు
జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. 2024 నవంబర్ 10న జస్టిస్ డీవై చంద్రచూడ్ రిటైర్ అవుతారు. ఆనవాయితీ ప్రకారం సీజేఐ తన వారసునిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును ప్రతిపాదిస్తారు. మాజీ సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. దీంతో ఆయననే ఖరారు చేశారు.
ప్రొఫైల్
- 1959 నవంబరు 11న బాంబేలో జస్టిస్ చంద్రచూడ్ జన్మించారు.
- దిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనమిక్స్‌లో బీఏ చేశారు జస్టిస్ చంద్రచూడ్.
- దిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌బీ చేశారు.
- ఆ తర్వాత ముంబయి యూనివర్సిటీ, అమెరికాలోని ఒక్లహామా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు.
- అనంతరం మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు.
- 2000 మార్చి 29న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2013 అక్టోబరు 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ అయ్యారు.
- అంతకుముందు 1998 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంతవరకూ అడిషినల్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.
- 2016 మే 13న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఆయన తండ్రి
44 ఏళ్ల క్రితం జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల అయిదు నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. సుదీర్ఘకాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు జస్టిస్ చంద్రచూడ్ కూడా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Also Read: Uttar Pradesh News: బైక్ చక్రంలో ఇరుక్కుపోయిన కోతి- ఎంత కష్టం వచ్చింది!