ఏకాంతంగా ఉన్నప్పుడు సరదాగా వీడియో తీసుకున్నారు. డబ్బులు అవసరమై వాటిని బయట పెడతానంటూ ప్రియుడు బెదిరించాడు. దీంతో చేసేదేం లేక, డబ్బులిచ్చినా పదే పదే ఇలాంటి బెదిరింపులు జరుగుతాయని భయపడి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివాహిత బెంగళూరులో ఆత్మహత్య చేసుకోగా, ఆమె ప్రియుడి కోసం నెల్లూరు పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటన బెంగళూరులోని యశ్వంతపురలో జరిగింది.


భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి, భార్య బ్యూటీపార్లర్.. 
బెంగళూరులో యశ్వంతపురలో ఓ కుటుంబం నివసిస్తోంది. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి, భార్య బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. ఇటీవల నెల్లూరుకి చెందిన మల్లికార్జునతో సోషల్ మీడియాలో భార్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెరిగి నేరుగా ఒకరినొకరు కలుసుకునే వరకు వెళ్లింది. ఆరు నెలలుగా భర్తకు తెలియకుండా వీరి వ్యవహారం జరుగుతోంది. సరదా కోసం ఏకాంతంగా ఉన్నప్పుడు వీరు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అవి ప్రియుడి దగ్గరే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రియుడు తనకు అర్జంట్ గా 2 లక్షల రూపాయలు కావాలన్నాడు. వివాహిత తన వద్ద లేవని చెప్పింది. అంతే అక్కడితో మల్లికార్జున అసలు రూపం బయటపడింది.


ఆ వీడియోలు బగటపెడతా..


ప్రియురాలు తనకు డబ్బులివ్వకపోయే సరికి మల్లికార్జున ఆమెను బెదిరించాలనుకున్నాడు. తాము ఏకాంతంగా కలిసి ఉన్న వీడియోలు తన దగ్గరే ఉన్నాయని, డబ్బులివ్వకపోతే వాటిని బయటపెడతానంటూ బెదిరించాడు. దీంతో ఆ వివాహిత షాకైంది. తనతో ప్రేమగా ఉన్న మల్లికార్జున నిజస్వరూపం తెలిసింది. ఒక్కసారిగా అతను బెదిరించే సరికి తట్టుకోలేకపోయింది. డబ్బులు చేతిలో ఉన్నా కూడా ఇవ్వాలని ఆమెకు అనిపించలేదు. ఎందుకంటే ఇది ఒకరోజుతో పోయే వ్యవహారంలా ఆమెకు అనిపించలేదు. పదే పదే డబ్బులు అడిగితే, తన వీడియోలు బయటపెడతానంటూ బెదిరిస్తే తానేం కావాలని భయపడింది. భర్తకు విషయం తెలిస్తే పరువు పోతుందని అనుకుంది. అంతే.. చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకుంది.


చనిపోయే ముందు ఆమె ప్రియుడికి ఓ సెల్ఫీ వీడియో కూడా పంపింది. డబ్బులకోసం తనను వేధించినందుకే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నానని చెప్పింది. ఆ వీడియోని ప్రియుడు మల్లికార్జునకు సెండ్ చేసి బెంగళూరులోని తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది వివాహిత. భర్త ఇంటికి వచ్చి చూసే సరికి భార్య చనిపోయి ఉంది. ఆమె ఫోన్ వెదికితే ఆ వీడియో బయటపడింది. దీంతో భర్త ఆ వీడియోని పోలీసులకు అందించాడు. యశ్వంత పుర పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. మల్లికార్జున సొంత ఊరు నెల్లూరు కావడంతో పోలీసులు ఇక్కడకు వచ్చి వెతుకులాట ప్రారంభించారు. మల్లికార్జున ఆచూకీ తెలియకపోవడంతో అతనికోసం గాలిస్తున్నారు.


చక్కని కుటుంబం ఉన్నా కూడా ఆ వివాహిత ప్రియుడి మోజులో పడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంది. పెళ్లైన తర్వాత పరిచయం అయిన ప్రియుడికోసం భర్తను కాదనుకుంది. చివరకు ప్రియుడు దారుణంగా మోసం చేయడం, బెదిరించాలని చూడటంతో తన ప్రాణాలు తానే తీసుకుంది. ప్రియురాలి మృతికి కారణం అయిన మల్లికార్జున ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పర్సనల్ వీడియోలు రికార్డ్ చేసి ప్రియురాలిని బెదిరించాలని చూసిన అతడు, ఇప్పుడు కటకటాల వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి.