Viral Video:
ఓ మహిళపై అందులోనూ లాయర్‌పై రోడ్డుపై జరిగిన దాడి వీడియో షాకింగ్‌గా ఉంది. ఆ వీడియోలో లాయర్‌ను తంతూ, జుట్టు లాగుతూ దుండగుడు కిరాతకంగా దాడి చేశాడు. అయితే ఈ దాడిని ఎవరూ ఆపకపోవడం మరో దారుణం. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది.
చూస్తూ నిల్చున్నారు!
మహిళపై అలా ఓ దుండగుడు దాడికి పాల్పడుతుంటే చుట్టూ ఉన్నవాళ్లు చోద్యం చూస్తూ నిల్చున్నారు. ఓ ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా మొబైల్ ఫోన్లలో ఘటనను చిత్రీకరిస్తూ అలాగే ఉండిపోయారు. బాధిత లాయర్ భర్త అక్కడ ఉన్న వారిని సాయం అడిగిన ఎవరూ స్పందించలేదు.
కర్ణాటక రాష్ట్రంలోని బగల్‌కోట్ జిల్లా వినాయక్ నగర్‌లో ఆదివారం జరిగింది ఈ సంఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎందుకు?
దాడికి గురైన లాయర్ పేరు సంగీత షిక్కేరి. ఆమెపై దాడికి పాల్పడ్డ వ్యక్తి పేరు మహంతేష్ చోలచగుడ్డ. సంగీత పొరుగింట్లోనే మహంతేష్ ఉంటున్నాడు. అయితే సివిల్ తగాదా విషయంలో సంగీతపై పగ పెంచుకుని మహంతేష్ ఈ దాడికి దిగినట్లు సమాచారం. ఆమె తనను అనేకమైన వేధింపులకు గురి చేసిందని, చాలా బాధ పెట్టిందని పోలీసుల ముందు మహంతేష్ తెలిపాడు.
అయితే గతంలో కూడా వీరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో వైరల్ కావడంతో మహంతేష్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ ఘటనపై లాయర్స్ అసోసియేషన్ సీరియస్ అయింది. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. లాయర్లకు రక్షణ కల్పించాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. మహిళపై దాడికి పాల్పడటం అమానుషమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: PM Modi in Nepal: నేపాల్ పర్యనటలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన
Also Read: Coronavirus Cases: దేశంలో కొత్తగా 2,202 కరోనా కేసులు- 27 మంది మృతి