యాభై ఏళ్లు దాటితేనే చాలా మంది వాలెంట్రీ రిటైర్మెంట్ తీసుకుని మరీ ఇంట్లో విశ్రాంతి తీసుకునేందుకు ఇష్టపడతారు.ఇక కొంతమంది సోమరిపోతులు తల్లిదండ్రుల మీదే ఆధారపడుతూ ఉద్యోగం చేసేందుకు కూడా ఇష్టపడరు. ఒకరి మీద ఆధారపడి బతికే వారి సంఖ్య తక్కువేమీ కాదు ప్రపంచంలో. ఇలాంటి వారంతా ఈ మాజీ సైనికుడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇతని వయసు 102 ఏళ్లు. ఇప్పటికీ విశ్రాంతి అంటే అతనికి తెలియదు. ఏదో ఒక పని చేస్తూ తన కాళ్లపై తాను నిలబడుతున్నారు. పేరు ఫిల్ హాగ్సన్. ఆస్ట్రేలియా దేశస్థుడు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల్లో ఇప్పటికీ బతికున్న వారిలో ఈయన ఒకరు. 


మొదట చేసిన ఉద్యోగం...
ఫిల్ రెండో ప్రపంచ యుద్ధం మొదలవ్వకముందు సెలూన్ నడిపేవారు. అది సరిగా నడవకపోవడంతో సేల్స్ మ్యాన్ గా మారారు. అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు సైనికుడిగా సైన్యంలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని యుద్ధం చేశారు. సైనికుడిగా 1962లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక కూడా ఆయన ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఎన్నో ఉద్యోగాలు చేసి కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నారు. టీవీ చూసే అలవాటు లేదని చెబుతారు ఫిల్. గత పదిహేనేళ్లుగా ఆయన పిల్లలు బొమ్మల బిజినెస్ చేస్తున్నారు. చెక్కతో చిన్న కుర్చీలు, బొమ్మలు చెక్కడం ఆయనకు తెలిసన కళ. షాపు పెట్టి వాటిని అమ్ముతున్నారు. ఈ షాపులో అందరూ ఫిల్ వయసు వారే పనిచేస్తారు. వచ్చిన డబ్బును అధికంగా సేవా కార్యక్రమాలకే వినియోగిస్తారు. 


ఫిల్ కొడుకు వయసు 79 ఏళ్లు. తండ్రి పని నుంచి రిటైర్ అవ్వలేదు కానీ కొడుకు మాత్రం గత కొన్నేళ్లుగా ఉద్యోగం నుంచి రిటైర్ అయి విశ్రాంతి తీసుకుంటున్నారు. తన తండ్రికి ఎంత చెప్పినా ఆయన వినడం లేదని, షాపు బాధ్యతలు నేను చూస్తానని చెప్పినా ఆయన పనిచేయడానికే ఇష్టపడుతున్నారని, అందుకే తాను రిటైర్ అయినట్టు చెబుతున్నాడు ఫిల్ కొడుకు. 




ఫిల్ భార్య నాన్సీ. ఈమె అయిదేళ్ల క్రితం మరణించింది. ఆమె మరణించేనాటికి ఫిల్ 97 ఏళ్లు. అప్పట్నించి ఒంటరిగానే ఆయన జీవిస్తున్నారు. ఆరోగ్యపరంగా తనకు ఎలాంటి సమస్యలు లేవని, తన పనులు తాను చేసుకోగలుగుతున్నానని చెబుతున్నారు. కొత్త విషయాలు, పనులు నేర్చుకోవడం తనకు చాలా ఇష్టమని చెబుతున్నారు. ఈ వయసులో పనిచేయడం కష్టంగా లేదా? అని ప్రశ్నిస్తే... ‘ఏమీ లేదు’ అని సమాధానం చెబుతున్నారు. వయసు, ఒంట్లో సత్తువ ఉన్నా కూడా ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడే వారు, సోమరిపోతులు ఈయనను చూసి చాలా నేర్చుకోవాలి.


Also read: గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? వీలైనంత వరకు వాడకపోతేనే మంచిది


Also read: ఏ పండ్లు తింటే ఏ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చో తెలుసా?