గర్భం ధరించాక  తినే ఆహారం నుంచి మందుల వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ వాడడం చాలా ప్రమాదకరం. బ్రిటన్ కు చెందిన అబెర్డీన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఈ అంశంపై భారీ పరిశోధన నిర్వహించారు. దాదాపు 30 ఏళ్ల పాటూ 151,000 మంది గర్భం ధరించిన వారి డేటాను విశ్లేషించారు. దాని ప్రకారం గర్భం ధరించిన సమయంలో అధికంగా పారాసెటమాల్, ఐబూఫ్రూఫెన్ వంటి మందులు వాడిన తల్లుల్లో ప్రసవం కష్టతరంగా మారినట్టు గుర్తించారు. కొందరికి పుట్టిన బిడ్డ చనిపోవడం లేదా, గర్భంలోనే మరణించడం వంటి కేసులు కూడా బయటపడ్డాయి. మరికొందరిలో నెలలు నిండకుండానే బిడ్డ పుట్టిన సందర్భాలనూ గుర్తించారు. అందుకే గర్భం ధరించిన సమయంలో పారాసెటమాల్, ఐబూ ప్రూఫెన్ మందులను అధికంగా వాడకూడదని సూచిస్తున్నారు. 


ఇవి కూడా...
పారాసెటమాల్, ఐబూఫ్రూఫెన్ మాత్రమే కాదు ఆస్పిరిన్, నాన్ స్టెరాయిడ్ యాంటి ఇన్ ఫ్లమ్మేటరీ డ్రగ్స్, డైక్లోఫెనాక్, న్యాప్రోక్సెన్ వంటి సమ్మేళనాలు కలిగినవి కూడా ప్రసూతి సమయంలో వినియోగించకూడదని సూచిస్తున్నారు పరిశోధకులు. గర్భధారణ సమయంలో పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్లు తీసుకున్న తల్లులలో 37 వారాల కంటే ముందుగా ప్రసవం అయ్యే అవకాశం 50 శాతం ఉండగా, ప్రసవసమయంలో బిడ్డ చనిపోయే అవకాశం 33 శాతంగా ఉంది. 


ఎంతో రిస్క్
ఇలాంటి మందులను వాడడం వల్ల పుట్టే పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ లోపాలు వచ్చే అవకాశం 64 శాతం, నియోనాటల్ యూనిట్లో చేర్చాల్సిన ప్రమాదం 57 శాతం, ప్రసవసమయంలో మరణించే అవకాశం 56 శాతం ఉన్నట్టు అధ్యయనంలో బయటపడింది. అలాగే పుట్టే బిడ్డ రెండున్నర కిలోల కన్నా తక్కువ బరువుతో పుట్టే అవకాశం 28 శాతం ఉన్నట్టు తేలింది. అందుకే మరీ అవసరం అయినప్పుడు తప్ప గర్భిణిలు పారాసెటమాల్, ఐబూప్రూఫెన్ల జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. 


జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి సాధారణ లక్షణాలు కనిపించినా కూడా ప్రపంచవ్యాప్తంగా 30 శాతం నుంచి 80 శాతం మహిళలు వైద్యుల వద్దకు వెళ్లకుండానే పారాసెటమాల్ వాడేస్తున్నారు.దాదాపు పదిమంది గర్భిణిలలో ముగ్గురు అధికంగా ఈ మందులను వాడుతున్నట్టు అధ్యయనం చెబుతోంది. గత ఏడేళ్లుగా ఈ మందుల వాడకం మరింతగా ఎక్కువైంది.  ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకు ప్రమాదమన్న సంగతి తల్లులు గ్రహించాలి. వైద్యుల సూచన మేరకు మాత్రమే మందులు వాడాలి. 


Also read: ఏ పండ్లు తింటే ఏ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చో తెలుసా?


Also read: పచ్చిబఠానీ దోశె, చూస్తేనే నోరూరిపోతుంది