ఉల్లి దోశె, మసాలా దోశె, పనీర్ దోశె, చీజ్ దోశె, రవ్వ దోశె... ఎప్పుడూ ఇవేనా ఓసారి పచ్చి బఠానీలతో కూడా దోశె వేసుకుని చూడండి. సరికొత్త రుచి మీకెంతో నచ్చేస్తుంది. పచ్చి బఠానీలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఎముకలకు చాలా బలాన్నిస్తాయి. వీటిని  తరచూ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా నిరోధించవచ్చు. వీటిలో విటమిన్ కె అధికంగా ఉంటుంది కనుక, ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం కారడం ఇట్టే ఆగిపోతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి మధుమేహం ఉన్న వారు కూడా వీటిని హ్యాపీగా తినవచ్చు. ఇవి నిజానికి డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి ఉత్తమ ఆహారం. రక్తంలో అధికంగా గ్లూకోజ్ చేరకుండా కాపాడుతుంది. జీర్ణ క్రియకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. రంగు వేయని పచ్చి బఠాణీలను వాడడం ఉత్తమం. కొన్ని సార్లు వీటిని ఆకుపచ్చ రంగు వేసి అమ్ముతారు. వాటిని కొనకపోవడమే మంచిది. తొడిమలతో సహా కొనుక్కుంటే వాటిని ఒలిచి వండుకోవచ్చు. అవి సహజసిద్ధమైన రంగుని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల  మల బద్ధకం సమస్య కూడా దరిచేరదు. పచ్చిబఠాణీలతో కొత్త రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాం. 


కావాల్సిన పదార్థాలు
పచ్చిబఠాణీలు - కప్పు
శెనగపిండి - అరకప్పు
ఉల్లిపాయ - ఒకటి
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - అయిదు
పచ్చిమిర్చి - మూడు
కొత్తి మీర - ఒక కట్ట
ఉప్పు - తగినంత
నూనె - దోశె వేయడానికి సరిపడా


తయారీ విధానం
1. పచ్చి బఠానీలను పరిశుభ్రంగా కడిగి మిక్సి గిన్నెలో వేయాలి. 
2. వెల్లుల్లి, అల్లం, ఉల్లి పాయ తరుగు, పచ్చిమిర్చి, కొత్తి మీర కూడా వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. 
3. ఆ పచ్చి బఠాణీల రుబ్బుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. 
4. ఇప్పుడు అందులో శెనగపిండి, ఉప్పు కూడా వేసి కలపాలి. 
5. దోశె వేసేంత జారుడుగా అనిపించకపోతే రుబ్బులో కాస్త నీళ్లు కలుపుకోవచ్చు. 
6. జీలకర్ర కూడా కలుపుకుంటే చాలా మంచిది. 
7. స్టవ్ పై పెనం పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక పలుచటి దోశెల్లా వేసుకోవాలి. 
8. రెండు వైపులా కాల్చుకుని టమాటా చట్నీతో తింటే టేస్టు అదిరిపోతుంది. 


పిల్లలకు చక్కటి టిఫిన్ ఇది. అప్పుడప్పుడు చేసిన పెడితే కొత్తగా ఉంటుంది కాబట్టి తినేస్తారు. స్కూళ్లు పెట్టాక కూడా ఈ టిఫిన్ బాక్సులో పెడితే రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా అనిపిస్తారు. పెద్దలకు కూడా ఇది ఉత్తమ అల్పాహారం. 


Also read: పొద్దు తిరుగుడు పూల గింజల ధర తక్కువే, తింటే వైరస్‌లను తట్టుకునే శక్తి ఖాయం


Also read: లైవ్‌లో వంట చేసి చూపిద్దామనుకుంది, కానీ జరిగింది మరొకటి