మహావిష్ణువు ఆలయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి రంగనాథ స్వామి ఆలయాలు. వైష్ణవులు తమ జీవితంలో ఒక్కసారైనా.. శ్రీరంగంలోని శ్రీరంగనాథుడి ఆలయాన్ని దర్శించాలని అనుకుంటారు. అలాంటి విశిష్ట ఆలయం నెల్లూరులో కూడా ఉంది. దక్షిణ శ్రీరంగంగా భాసిల్లుతున్న ఈ ఆలయం తల్పగిరి రంగనాథ స్వామివారి సన్నిధానం. 


స్కాంద పురాణంలో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ ప్రస్తావన ఉంది. ఆదిశేషువు కొండగా ఏర్పడి, ఆ కొండపై శ్రీమన్నారాయణుడు వెలసిన క్షేత్రమే తల్పగిరి అంటారు. దేవతల విన్నపంతో తల్పగిరిని భూమట్టానికి సరిచేసి శ్రీరంగనాథుడిగా మహావిష్ణువు ఇక్కడ వెలిశాడని పురాణ కథనం. 


ప్రధానాలయం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. రంగనాథుడు విగ్రహం కూడా పశ్చిమాభిముఖంగా ఉండటం విశేషం. ఆలయానికి పడమర వైపున పెన్నానది ప్రవహిస్తుంటుంది. గతంలో పెన్నానది రెండు పాయల నడుమ ఆలయం ఉండేదని, కాలక్రమంలో ఇప్పుడు పశ్చిమ ఒడ్డున ఆలయం వచ్చేసిందని అంటారు. 


12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా ప్రాచుర్యంలో ఉండేది. 17 శతాబ్దం తర్వాత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్తులుగా ఉంటుంది. దీని ఎత్తు 95 అడుగులు ఉంటుంది. గాలిగోపురం ప్రత్యేకత ఏంటంటే.. దీని గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావన ఉంది అంటారు. రంగనాథుడి ఆలయం గాలిగోపురంపై కాకి వాలి.. పెన్నా నది నీటిని తాగితే.. కలియుగాంతం జరుగుతుందని అంటారు. అంటే అంత ఎత్తుకి పెన్నా నది నీరు వస్తే అప్పుడు జల ప్రళయం తప్పదని సంకేతం. అయితే దీని గురించి చారిత్రక ఆధారాలు లేవు కానీ.. గతంలో వరదల సమయంలో శయన స్థితిలో ఉన్న రంగనాథుడి ఆలయం గొంతు వరకు నీరు వచ్చినట్టు ఆధారాలున్నాయి. ఆ తర్వాత ఇటీవల కాలంలో కూడా రంగనాథుడి ఆలయ ప్రాంగణంలోకి పెన్నమ్మ నీరు వచ్చి చేరింది. కానీ ధూప దీప నైవేద్యాలకు ఎప్పుడూ ఆటంకం లేదని అంటారు. 


12వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు, కుళోత్తుంగ చోళుడు ఆలయాన్ని అభివృద్ధి చేశారని చారిత్రక ఆధారాలున్నాయి. తిక్కన సోమయాజి ఇక్కడే మహాభారతాన్ని ఆంధ్రీకరించారని చెబుతారు. పెన్నా నది తీరంలో ఆయన ఈ కార్యాన్ని పూర్తి చేశారని చెబుతారు. 


ఇక దేవాలయంలో చెప్పుకోదగ్గ మరో విశేషం అద్దాల మండపం. అద్దాల మండపంలో పలు చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటాయి. మండపం మధ్యలో ఉన్న శ్రీకృష్ణుడి చిత్రపటం మనం ఎటునుంచి చూసినా మనల్నే చూస్తున్నట్టు ఉంటుంది. వటపత్ర శాయి రూరంలో ఉండే చిన్ని కృష్ణయ్య చిత్రాన్ని అంత అద్భుతంగా చిత్రీకరించారు. 


మహ్మదీయుల పాలనలో దాడులు జరుగుతాయనే ఉద్దేశంతో మూల విరాట్‌కి సున్నపు పూత పూశారని, ఇప్పటికీ దాన్ని మనం చూడొచ్చని అంటారు పూజారులు. రంగనాథుడి శయన రూప దర్శనంతోనే సకల పాపాలు హరించుకుపోతాయని చెబుతారు.   


రంగనాథుడి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. నెల్లూరు వచ్చే పర్యాటకులు చేసుకునే తొలి దర్శనం రంగనాథుడిదే కావడం విశేషం. దక్షిణాదిన రంగనాథ స్వామి ఆలయాలు అరుదు. అందులోనూ ఇలా చారిత్రక విశేషాలున్న తల్పగిరి రంగనాథుడి సన్నిధానం దక్షిణ శ్రీరంగంగా ప్రసిద్ధికెక్కింది.