Viral Video: సోషల్ మీడియాలో యువకులు బైక్‌లపై విన్యాసాలు చేస్తున్న వీడియోలు.. ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అమ్మాయిలను ఎక్కించుకొని కొందరు, స్నేహితులను ఎక్కించుకొని మరికొందరు ప్రమాదకర స్థితిలో బైక్ లపై స్టంట్లు చేస్తుంటారు. అయితే తాజాగా ముంబయిలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువకుడు ముందూ వెనక అమ్మాయిలను కూర్చోబెట్టుకొని... బైక్ పై స్టంట్లు చేశాడు. దీన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా... వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన ముంబయి పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఈ బైక్ రైడ్ ఎక్కడ జరిగిందో గుర్తించారు. అలాగే ప్రమాదకరంగా స్టంట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీసులు బైక్ రైడర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
బైక్ పై ఇద్దరు అమ్మాయిలతో స్టంట్
బైక్‌పై స్టంట్ చేస్తున్న వ్యక్తిని ఆంటోప్ హిల్‌కు చెందిన ఫయాజ్ ఖాద్రీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అతను బైక్‌పై విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఆ సమయంలో అతనితో మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై విన్యాసాలు చేస్తున్న సమయంలో ఏ ఒక్కరూ హెల్మెట్ ధరించలేదు. ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలను కూడా పాటించలేదు.
నిందితుడి అరెస్ట్..
బైక్‌పై ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఓ వ్యక్తి విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో.. సామాజిక సేవల కోసం పని చేస్తున్న 'పోథోల్ వారియర్స్' అనే సంస్థ ట్వీట్ చేయడం ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతను ప్రమాదకర విన్యాసాలు చేయడమే కాకుండా.. యువతను ప్రేరేపించేలా చేస్తున్నాడని కూడా పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఐపీసీ, మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ అబ్బాయితోపాటు బైక్‌పై కూర్చున్న అమ్మాయిలపై కూడా కేసులు పెట్టాలని... అలాంటి వాటిని ప్రోత్సహించేలా అమ్మాయిల తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా షేర్ చేశారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నడి రోడ్డుపై బైక్ తో విన్యాసాలు చేస్తున్న ఇలాంటి పైత్యపు ఘటనలకు బాధ్యులెవరూ!? అంటు క్వశ్చన్ చేశారు.