Viral Video: ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడు.. కర్కశంగా ప్రవర్తించాడు. ఓ మూగజీవిని తన కారుకు తాడుతో కట్టేసి కిలోమీటర్లు లాక్కెళ్లాడు. కారు వేగంతో పరిగెత్తలేక ఆ శునకం కిందపడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
రాజస్థాన్ జోధ్‌పుర్‌లో ఆదివారం ఓ శునకాన్ని కారుకు కట్టేసి లాక్కెళ్లాడు ఓ వ్యక్తి. రద్దీగా ఉన్న రోడ్డులో తన కారుకు శునకాన్ని తాడుతో కట్టేసి వేగంగా పోనిచ్చాడు. తాడు పొడవు ఎక్కువగా ఉండటంతో ఆ శునకం అటూ ఇటూ ఊగుతూ అత్యంత ప్రమాదకర స్థితిలో పరిగెత్తింది. ఇది గమనించిన ఓ వ్యక్తి కారును ఆపేందుకు ప్రయత్నించినా డ్రైవర్ ఆగలేదు. కారును స్పీడ్‌గా డ్రైవ్ చేయడంతో కుక్క వేగంగా పరిగెత్తలేక కిందపడిపోయింది. అయినప్పటికీ అతను మాత్రం కారును ఆపలేదు.
ఆ తర్వాత కొందరు స్థానికులు కారును అడ్డగించి శునకాన్ని విడిపించారు. ఆ తర్వాత ఎన్జీవోకు సమాచారమివ్వగా వారు వచ్చి శునకాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
డ్రైవర్ ఓ డాక్టర్
ఈ దారుణానికి పాల్పడింది ఓ పేరున్న వైద్యుడని తెలియడం మరింత షాక్‌కు గురి చేస్తోంది. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జన్ అయిన రజనీశ్ గ్వాలా ఇలా శునకాన్ని కారుతో లాక్కెళ్లాడు. ఆ వీధి శునకం ఎప్పుడు చూసినా తన ఇంటి ముందే ఉంటుందని, అందుకే దూరంగా పంపించేందుకు ఇలా చేశానని ఆ వైద్యుడు చెప్పడం కొసమెరుపు.
వైద్యుడు చేసిన ఈ అమానుష చర్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను ఎన్జీవో సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. సదరు వైద్యుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. అతని లైసెన్సును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Kejriwal On AAP Party: 'ఆప్ పుట్టుకకు దేవుడే కారణం- గుజరాత్‌లో మా విజయం తథ్యం'
Also Read: Mukesh Ambani: గురువాయూర్ క్షేత్రాన్ని సందర్శించిన అంబానీ- రికార్డ్ స్థాయిలో భారీ విరాళం!