Mukesh Ambani Visits Guruvayur Temple: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ.. కేరళలోని గురువాయూర్ క్షేత్రాన్ని శనివారం సందర్శించారు. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రాధికతో కలిసి గురువాయురప్పగా పిలుచుకునే శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి అంబానీకి దర్శనం చేయించారు.
భారీ విరాళం
ఈ సందర్భంగా ఆలయంలో అన్నదానం కోసం రూ.1.51 కోట్లు అంబానీ విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ సీనియర్ అధికారులు ధ్రువీకరించారు.
అలాగే ఆలయం ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన మెడికల్ సెంటర్ ప్రణాళికను ముకేశ్ అంబానీ ముందు ఆలయ అధికారులు ఉంచారు. ఇందుకోసం రూ.50 కోట్లు ఖర్చవుతుందని సాయం చేయాలని కోరారు. ఈ అభ్యర్థనను తాను పరిశీలిస్తానని అంబానీ పేర్కొన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈ- హుండీ
మరోవైపు గురువాయూర్ ఆలయంలో ఈ-హుండీని ప్రారంభించారు. ఇప్పుడు భక్తులు డిజిటల్ విరాళాలు ఇవ్వవచ్చు. అక్కడున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ కానుకను డిజిటల్ విధానంలో అందించవచ్చని అధికారులు తెలిపారు.
శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారిని కూడా ముకేశ్ అంబానీ ఇటీవల దర్శించుకున్నారు. కాబోయే కోడలు రాధికతో కలసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు.
దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ముకేశ్ అంబానీకి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపలో మీడియాతో అంబానీ మాట్లాడారు.
భారీ విరాళం
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు అంబానీ. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఆ సమయంలో అంబానీతో పాటు ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పాల్గొన్నారు.
Also Read: యూరప్‌లో ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించిన తెలంగాణ కుర్రాడు, హర్యానా గవర్నర్ అభినందనలు
Also Read: Viral Video: బ్యాగులోని ఆపిల్ ను కొట్టేసిన కోతి ఎలా పారిపోతుందో చూడండి?