Delhi Metro Train: పబ్లిక్ ప్లేసుల్లో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం రోజురోజుకూ ఎక్కువైపోతుంది. ప్రాంక్ లు, రీల్స్ అంటూ ఇన్నాళ్లు ప్రజలను ఇబ్బందులు పెట్టిన కొందరు ఆకతాయిలు.. ఇప్పుడు తమకు పర్సనల్ పనులను చేసుకుంటూ మరింత అసౌకర్యానికి గురయ్యేలా చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ఇలాంటి అరాచకాలు చాలానే జరిగాయి. అయితే తాజాగా ఓ అమ్మాయి మెట్రో రైల్లోనే హెయిర్ స్ట్రెయిట్‌నింగ్‌ చేసుకుంటూ కనిపించింది. అయితే దీన్ని వీడియో తీసిన ఓ యువకుడు నెట్టింట పెట్టగా తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోపై పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. పలువురు ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తుండగా.. మరికొందరేమో ఇదేమైనా నీ బెడ్ రూమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ప్రయాణికులకు ఇబ్బంది కల్గించే ఎలాంటి పనులను కూడా రైల్లో చేయొద్దని ఇటీవలే మెట్రో సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా ఎక్కువ మంది రీల్స్ చేస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కల్గిస్తున్న విషయాన్ని గుర్తించి ఇటీవలే మెట్రోలో రీల్స్ నిషేధాన్ని ప్రకటించింది. 






ఢిల్లీ మెట్రోలో రీల్స్ నిషేధం..!


ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ సంస్థ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేసింది. అందులో మెట్రోలో రీల్స్ చేయరాదని వార్నింగ్ ఇస్తూ.. మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో జానీ జానీ యెస్ పాపా.. మేకింగ్ రీల్స్ ఇన్ ది మెట్రో నో పాపా.. అని అడ్వైజరీలో పేర్కొంది. దీనికి ఓపెన్ యువర్ కామెరా.. నా నా నా అంటూ రాసుకొచ్చింది. ప్రయాణికులకు అసౌకర్యం కల్గించే ఇలాంటి కార్యకలాపాలను ఢిల్లీ మెట్రోలో నిషేధిస్తున్నామని వెల్లడించింది. డీఎంఆర్సీ చేసిన ఈ పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఢిల్లీ మెట్రో సర్వీసుల నాణ్యతే కాదు.. హస్యం కూడా మామూలుగా లేదంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. వార్నింగ్ కూడా చాలా స్వీట్ గా ఉందంటూ మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఇంత ఫన్నీగా చెప్తే.. కచ్చితంగా రీల్స్ చేయమంటూ మరికొంత మంది రాసుకొచ్చారు. 






ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ట్రైన్‌లలో ఏదో అభ్యంతరకరమైన సంఘటనలు జరగడం, ఆ వీడియోలు వైరల్ అవడం కామన్ అయిపోయింది. ఈ మధ్య కొంత మంది యువకులు మెట్రోలో రచ్చ చేశారు. మెట్రో రైల్ కోచ్‌ డోర్‌ మూసుకుపోతుంటే...కావాలనే కాళ్లు అడ్డం పెట్టి ఆపేశారు. ఇలా ఒక్కసారి కాదు. పదేపదే అలాగే చేస్తూ మెట్రో కదలకుండా చేశారు. ఫలితంగా...ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. ఆ గ్యాంగ్ మాత్రం పగలబడి నవ్వుకుంటూ వీడియో తీసింది. కరోల్ బాగ్ స్టేషన్‌లో మెట్రో ఆగినప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ గ్యాంగ్ కారణంగా మెట్రో ఆలస్యంగా నడిచిందని కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. అమన్ అనే ఓ నెటిజన్ ఈ వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఢిల్లీ మెట్రోని ట్యాగ్ చేస్తూ.."ఇలాంటి వాళ్ల వల్ల మెట్రో లేట్‌గా నడుస్తోంది" అని ట్వీట్ చేశాడు.