Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌ను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. విశ్వహిందూ పరిషత్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, వీహెచ్‌పీ నేత అలోక్‌ కుమార్‌ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. దేశంలో హిందువుల జనాభా రేటు తగ్గుతోందని, ముస్లింల జనాభా రేటు వేగంగా పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం జనాభా సమతుల్యత దెబ్బతింటే దేశంలో అనేక సమస్యలు ఉత్పన్నం అమవుతాయని వివరించారు. ప్రభుత్వం త్వరలో జనాభా విధానాన్ని, యూనిఫాం సివిల్‌ కోడ్‌ను తీసుకురావాలని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించాలని సూచించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రోత్సహించే వారిలో ముస్లింలు ముందుటారని చెప్పుకొచ్చారు. తమ మతస్థులు పెరగాలని ఇలా కోరుకుంటున్నారని ఆయన అభివర్ణించారు. కానీ ప్రజలంతా ఈ అభిప్రాయాలను మార్చుకుని దేశ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అలోక్ కుమార్ సూచించారు. 


'ఇది మా రాజ్యాంగ లక్ష్యం'


ఆదివారం (ఫిబ్రవరి 19) కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. యూసీసీ గురించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి, దానిని అమలు చేయడానికి ప్రయత్నించాలని వివరించారు. ఎందుకంటే ఇది రాజ్యాంగ లక్ష్యం అని... దీనిపై ప్రజల్లో అపోహలు ఉంటే ఎలాంటి గొడవలు లేకుండా అందరికీ అర్థం అయ్యేలా చెప్పాలని అన్నారు.


యూనిఫాం సివిల్ కోడ్ అంటే ఏమిటి?


యూనిఫాం సివిల్ కోడ్ అంటే వివాహం, విడాకులు, పిల్లల దత్తత, ఆస్తి విభజన వంటి విషయాల‌్లో పౌరులందరికీ ఏకరూప నియమాలు ఉండడం. మరో మాటలో చెప్పాలంటే.. కుటుంబ సభ్యుల మధ్య హక్కులు, సంబంధాల సమానత్వం. కులం-మతం-సంప్రదాయం ఆధారంగా రాయితీ ఉండదు. ప్రస్తుతం భారతదేశం మతం, సంప్రదాయం పేరుతో వివిధ నియమాలను అనుసరిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని సమాజాల్లో పిల్లలను దత్తత తీసుకోవడంపై నిషేధం ఉంది. పురుషులు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు. ఎంతమంది పిల్లలనైనా కనొచ్చు. పెళ్లైన ఆడ వాళ్లకు తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకూడదనే నిబంధన కూడా ఉంది. యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తే ఇలాంటి అన్ని విషయాల్లో సమానత్వం ఉంటుంది.


గుజరాత్‌లో ఎన్నికల సందర్భంలో కూడా సివిల్ కోడ్ వివాదం 





గుజరాత్ ఎన్నికల్లో ప్రధానంగా వినిపించిన  అంశం యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC). బీజేపీ ఇదే ప్రచారాస్త్రంగా మలుచుకోగా...అటు ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు చేశాయి. ఈ వాద ప్రతివాదాలుజరుగుతుండగానే...కేంద్ర హోం మంత్రి అమిత్‌షా యూసీసీ (Uniform Civil Code)పై అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కోడ్‌ను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. అయితే...అంత కన్నా చర్చలు, వాదనలు తప్పకుండా వింటామని అన్నారు. జనసంఘ్‌గా ఉన్న నాటి నుంచే బీజేపీ ఈ హామీ ఇస్తూ వస్తోందని గుర్తు చేశారు. "బీజేపీ మాత్రమే కాదు. ఎప్పుడో మన రాజ్యాంగ పరిషత్ కూడా యూసీసీని సరైన సమయంలో అమలు చేయొచ్చని సూచించింది. సెక్యులర్ దేశంలో మతాల ఆధారంగా చట్టాలు చేయడం సరికాదని చెప్పింది. రాష్ట్రాలన్నీ సెక్యులర్‌గా మారిపోతే అప్పుడు మతాల ఆధారంగా చట్టాల అవసరం ఎందుకు.." అని అన్నారు అమిత్‌షా. అప్పట్లో రాజ్యాంగ పరిషత్ చేసిన సూచనలు కాలక్రమంగా మరుగున పడిపోయాయని చెప్పారు. బీజేపీ తప్ప మరే పార్టీ కూడా యూసీసీకి మద్దతునివ్వడం లేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఏది అమలు చేయాలన్నా కచ్చితంగా దానిపై వాదోపవాదాలు జరగాలని అభిప్రాయపడ్డారు. 

 







గుజరాత్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రంలో కోడ్‌ను అమలు చేసేందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించినట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర కేబినెట్ ఈ కమిటీని నియమించేందుకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు సర్వాధికారాలు కట్టబెట్టింది. ఓ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది.  ఇప్పటికే ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తామూ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సంకేతాలిచ్చాయి.