Visakha News: విశాఖపట్నం జిల్లా ఎస్.కోట గ్రామ శివారు గుడిలోవ అనే కొండ ప్రాంతంలో నివసిస్తున్న జన్ని మంగ అనే గిరిజన మహిళకు నెలలు నిండక ముందే శనివారం తెల్లవారు జామున మగ బిడ్డను ప్రసవించింది. కడుపు నొప్పి ఎక్కువగా వస్తుందని ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పింది. దీంతో వాళ్లు ఆదివారం ఉదయం ఆ గిరిజన మహిళ భర్త ఎస్.కోటలో ఉన్న ఎఎన్ఎంకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆ గ్రామ ఏఎన్ఎం పార్వతీదేవి, ఆశా వర్కరు లక్ష్మి ఇద్దరు ఆ గిరిజన మహిళకు ప్రాథమిక వైద్యం అందించారు. తల్లీబిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. అయితే మరింత మెరుగైన వైద్యం కోసం స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి ఎటువంటి రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ఆశా వర్కర్, ఏఎన్ఎం ఇద్దరూ డోలి కట్టి ఆగిరిజన మహిళ ఉంటున్న కొండ దగ్గర నుంచి క్రిందకు మోసుకు వచ్చారు. 




మహా శివరాత్రి కావడం ఆ గ్రామంలో ఎవరూ అందుబాటులో లేకపోవడం వల్ల వైద్య సిబ్బంది ఇద్దరూ కష్టపడి డోలి మోశారు. అయితే ఆ బాలింత కొండ దిగువకు రావడానికి, ఆసుపత్రిలో చేరడానికి ససేమిరా అనడంతో ఆదివారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి వైద్యం అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఏఎన్ఎం, ఆశా వర్కర్ తెలిపారు. దీనిపై స్పందించిన గిరిజన మహిళ భర్త.. ఏఎన్ఎంతో పాటు ఆశా వర్కర్ కు ధన్యవాదాలు తెలిపారు. వాళ్లు ఉండబట్టే తన భార్య, కుమారుడు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. 


గతేడాది జులైలో కూడా ఇలాంటి ఘటనే..


పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చిన తోలుమండ గ్రామానికి చెందిన కొండగొర్రి కాసులమ్మ అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం చినతోలుమండ గ్రామం నుంచి డోలీ సాయంతో కొండ కిందికి దించారు. అక్కడి నుంచి ఫీడర్ అంబులెన్స్ లో సమీపంలోని రావాడ రామభద్రాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించడంతో పండంటి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. సకాలంలో వైద్య సేవలు అందడం వలన తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు. చిన తొలిమండ గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడం వలన ఎవరికి ఏ జబ్బు చేసిన సరే వారికి డోలి మోతలే శరణ్యం. 


గర్భిణీ వసతి గృహాలు


ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఆ గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాల్సిందిగా గ్రామస్తులు వేడుకుంటున్నారు. రానున్నది వర్షాకాలం ఆరోగ్య సమస్యలు ఏం వచ్చినా మాకు డోలీ మోతలే దిక్కు. ఒక పక్క డోలీ మోస్తూ ఇంకొకపక్క వర్షంలో తడుస్తూ మోసుకు వచ్చినప్పుడు పిడుగులు పడతాయని భయం, అధిక వర్షం కురిస్తే ఏంచేయాలనే భయం ఉంటాయని గిరిజనులు అంటున్నారు.  గతంలో అప్పటి పీవో డాక్టర్ లక్ష్మీష ఏర్పాటుచేసిన గర్భిణీ వసతి గృహానికి ఏడు నెలలు నిండిన గిరిజన గర్భిణీలను తరలించేవారు. అలాంటి వసతి గృహాలు ఏర్పాటు చేస్తే గిరిజనుల ప్రాణాలు కాపాడే వాళ్లవుతారని ప్రజలు కోరుతున్నారు.