Pawan Kalyan : అరుదైన వ్యాధితో 12 ఏళ్లకే చిన్నారి రేవతి శివైక్యం చెందడం తనను ఎంతగానో బాధించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖకు చెందిన చిన్నారి రేవతి మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. పుట్టుకతోనే మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో చిన్నారి రేవతి బాధపడుతుందని గుర్తుచేసుకున్నారు. ఒక్క అడుగు కూడా నడవలేని స్థితిలో రేవతి ఉండేదన్నారు. నాలుగేళ్ల కిందట పోరాట యాత్ర చేస్తున్న సందర్భంలో విశాఖ నగరంలో చిన్నారి రేవతి తనను కలిసిందని పవన్ తెలిపారు. రేవతి శివైక్యం చెందిదన్న బాధాకర విషయం తన మనసును తీవ్రంగా కలచివేసిందన్నారు.
750 శ్లోకాలు కంఠస్థం చేసిన బాలిక
"పుట్టుకతోనే అతి భయంకరమైన మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో జన్మించిన రేవతి ఒక్క అడుగు కూడా నడవలేని స్థితిలో ఉండేది. నాలుగేళ్ల
కిందట నన్ను ఆ చిన్నారి కలిసేనాటికి ఏడెనిమిదేళ్ల వయస్సు ఉంటుందనుకుంటా. అటువంటి ఆరోగ్యస్థితిలో కూడా చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ ఆ చిన్నారి చూపిన మానసిక ధైర్యం నన్ను అబ్బురపరచింది. కొన్ని భక్తి గీతాలు కూడా నా ఎదుటపాడి ఆశ్చర్యపరిచింది. ఆమెకు నేను ఇచ్చిన మూడు చక్రాల బ్యాటరీ సైకిల్ పై పాఠశాలకి కూడా వెళ్తుందని, భగవద్గీతలోని 750 శ్లోకాలను కంఠస్థం చేసిందని తెలిసి చాలా ఆనందించాను. అయితే తనకున్న వ్యాధి కారణంగా ఆ చిన్నారి 12 ఏళ్లకే శివైక్యం చెందడం చాలా బాధాకరం. తుది శ్వాస విడిచే సమయంలోనూ భగవన్నామ స్మరణ చేస్తున్న వీడియో నా మనసును కలచి వేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. పుట్టినప్పుడే ఆమె ఎక్కువ కాలం బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పినా, 12 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకున్న రేవతి తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను." - పవన్ కల్యాణ్