తెలంగాణలోని గురుకులాల్లో ఇప్పటికే ఉన్న ఖాళీలకు తోడు మరో 2 వేలకు పైగా పోస్టులు వచ్చి చేరాయి. దీంతో రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య భారీగా పెరిగింది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో మరో 2వేలకు పైగా పోస్టుల్ని ఆయా సొసైటీలు గుర్తించాయి. వాటిని త్వరలోనే జారీ చేయనున్న గురుకుల నియామక ప్రకటనల్లో భాగంగా నింపేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాయి. త్వరలో ఈ పోస్టులకు అనుమతులు లభిస్తాయని సొసైటీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో గురుకులాల్లో భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య 13 వేలకు పైగా చేరుకునే అవకాశాలున్నాయి.  ప్రస్తుతం గురుకులాల్లో 11,012 పోస్టులకు అనుమతులు లభించాయి. సంబంధిత నియామక ప్రకటనలు సిద్ధమయ్యాయి. కొత్తగా మంజూరయ్యే ఎస్సీ, ఎస్టీ గురుకులాల పోస్టులు కలిపి ఒకేసారి ప్రకటనలు ఇవ్వాలని గురుకుల నియామకబోర్డు భావిస్తోంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంత వరకూ నోటిఫికేషన్‌ వేయడంలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) తాత్సారం చేస్తుందనే విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. 


సంక్షేమ గురుకులాల్లో తొలుత ప్రభుత్వం 9,096 పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి బీసీ సొసైటీ పరిధిలో కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కళాశాలలు ప్రారంభమయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించి బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా, ఈ జనవరిలో బీసీ గురుకుల సొసైటీలో 2,591 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. బీసీ పోస్టులు తేలాక గురుకుల నియామక ప్రకటనలు ఇవ్వాలని బోర్డు భావించింది. అయితే అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో దాదాపు 2వేలకు పైగా ఖాళీ పోస్టులున్నట్లు సొసైటీలు గుర్తించాయి. ఈ పోస్టుల భర్తీకి సకాలంలో ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. బీసీ గురుకులాల్లో అదనపు పోస్టులకు అనుమతులు వచ్చాక ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోనూ అదనపు పోస్టులకు అనుమతులు ఇవ్వాలని సొసైటీలు ప్రభుత్వానికి నివేదించాయి. అవి త్వరలోనే లభించే అవకాశాలున్నట్లు సొసైటీ వర్గాలు వెల్లడించాయి.


ఎన్నికల కోడ్ వల్లే ఆలస్యం..?
గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి ఇప్పటికే బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. అందుబాటులోని 11,012 పోస్టులకు నియామక ప్రకటనలు సిద్ధం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో అవి నిలిచిపోయాయి. కోడ్ ముగిసే సమయానికి ఎస్సీ, ఎస్టీ గురుకుల పోస్టులకు అనుమతులు వస్తే వాటిని కలిపి ప్రకటనలు ఇవ్వాలని భావిస్తోంది. అయితే మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. ఈలెక్క ప్రకారం చూసుకుంటే గురుకుల నోటిఫికేషన్‌ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాతే గురుకుల నోటిఫికేషన్‌ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గురుకులాల ఉద్యోగ ప్రకటనల జారీలో బ్యాక్‌లాగ్ నివారించేందుకు తొలుత ఉన్నత పోస్టులకు, అనంతరం కిందిస్థాయి పోస్టులకు ప్రకటనలు జారీచేసి ఆ మేరకు భర్తీ ప్రక్రియను నియామక బోర్డు చేపట్టనుంది.


టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించాలనే డిమాండ్‌..
గ్రూప్‌-1, 2, 3, 4తో పాటు వివిధ రకాల ఉద్యోగాలకి టీఎస్‌పీఎస్‌సీ వెంట వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే మరో పక్క గురుకుల బోర్డు మాత్రం నియామక ప్రక్రియను చేపట్టడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో గరుకుల పోస్టుల నియామక ప్రక్రియను టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించాలని ఉద్యోగార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీలో భాగంగా టీఎస్‌పీఎస్‌సీ, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు, తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులు ఉద్యోగ ప్రకటనలను ఇప్పటికే వెలువరించాయి. ఈ మూడు నియామక బోర్డుల పరిధిలో దాదాపు 45 వేల నుంచి 50 వేల వరకు వివిధ ప్రకటనలు జారీ చేశాయి. కానీ గురుకుల బోర్డు మాత్రం సుమారు 12 వేల వరకు ఉన్న పోస్టులకు ఇప్పటికీ ప్రకటన జారీ చేయలేదు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన గురుకుల ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇన్నిరోజులేమో రోస్టర్‌ జాబితా తదితర కారణాలు చూపిస్తూ కాలయాపన చేసిన బోర్డు ఇప్పుడేమో ఎన్నికల కోడ్‌ అంటూ నోటిఫికేషన్‌ జారీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్‌ జారీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.