Alluri District Accident : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హుకుంపేట పరిధిలో బైక్ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుకుంపేట మండలంలోని బూర్జ పంచాయతీ దిగువ సాల్తాంగి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై అరకు బొర్రా గుహల చూసేందుకు వెళ్లారు. అక్కడ శివరాత్రి వేడుకలు చూసి ఆదివారం ఉదయం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. లుంగపర్తి పంచాయతీ రాయపాడు శివారులోని మలుపు వద్ద రాగానే బైక్ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు యువకులు బుట్టన్న, గణేశ్, రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మలుపులో స్పీడ్ కంట్రోల్ చేయలేకపోవడంతో బైక్ అదుపుతప్పి లోయలోపడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో తిరుమలకు వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి అదుపు తప్పింది. డైవర్ అదుపు చేయకపోవడంతో ఒక్కసారిగా బస్సు సేఫ్టీ వాల్ పైకి దూసుకెళ్లింది. కొండకు ఆనుకొని ఉన్న ప్రాంతం కావడంతో పేను ప్రమాదం తప్పింది. బస్సుకు ఎడమవైపు కిటికీ అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న భక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయని సమాచారం.
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ లో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో అద్దంకి ఎస్సై సమందవరవి భార్య వహీదా(35), ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె ఆయేషా, ఫ్యామిలీ ఫ్రెండ్స్... బుర్రాల జయశ్రీ (50), బుర్రాల దివ్యతేజ (29), డ్రైవర్ బ్రహ్మచారి (22) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే..?
టీఎస్ 07 జీడీ 3249 నంబరు గల కారు ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తోంది. మేదరమెట్ల దక్షిణ బైపాస్ సమీపంలోకి రాగానే కార్టు టైరు ఒక్కసారిగా పంక్చరై అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే కారు పల్టీ కొట్టి అవతలి వైపుకు ఎగరి పడిపోయింది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురితో సహా డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతేదాహలను బయటకు తీశారు. ఎవరైనా బతికున్నారేమోనని చూశారు. కానీ అప్పటికే వారంతా చనిపోయారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ రోశయ్య.. ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వీరంతా చినగంజాం తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ప్రమాదం చోటు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.