Bapatla Accident: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ లో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో అద్దంకి ఎస్సై సమందవరవి భార్య వహీదా(35), ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె ఆయేషా, ఫ్యామిలీ ఫ్రెండ్స్... బుర్రాల జయశ్రీ (50), బుర్రాల దివ్యతేజ (29), డ్రైవర్ బ్రహ్మచారి (22) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 


అసలేం జరిగిందంటే..?


టీఎస్ 07 జీడీ 3249 నంబరు గల కారు ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తోంది. మేదరమెట్ల దక్షిణ బైపాస్ సమీపంలోకి రాగానే కార్టు టైరు ఒక్కసారిగా పంక్చరై అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే కారు పల్టీ కొట్టి అవతలి వైపుకు ఎగరి పడిపోయింది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురితో సహా డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతేదాహలను బయటకు తీశారు. ఎవరైనా బతికున్నారేమోనని చూశారు. కానీ అప్పటికే వారంతా చనిపోయారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ రోశయ్య.. ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వీరంతా చినగంజాం తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ప్రమాదం చోటు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.    


నిన్నటికి నిన్న చిత్తూరులో ప్రమాదం -  యువకుడి సజీవదహనం


చిత్తూరు జిల్లా‌ మదనపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం‌ జరిగింది. మదనపల్లి - పుంగనూరు జాతీయ రహదారిలోని బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడిని గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. దాంతో ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ద్విచక్ర వాహనంతో పాటుగా యువకుడు సజీవ దహనం అయ్యాడు. శనివారం ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారిపై పట్ట పగలు యువకుడిని లారీ ఢీకొన్న తరువాత అతడు సజీవ దహనం అవుతుంటే భయాందోళనకు గురైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది..


తాను అమ్మవారికి దండం పెట్టుకుంటుండగా ఓ లారీ వచ్చి బైకు పై వెళ్తున్న యువకుడ్ని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు అన్నారు. కానీ కొన్ని నిమిషాల వ్యవధిలో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం అయ్యారని తెలిపారు. మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయిందని నిమిషాల సమయంలోనే ఘోరం జరిగిందని స్థానికులు వెల్లడించారు. లారీ ఢీకొట్టడంతో బైక్ ట్యాంక్ పగిలి పెట్రోల్ లీక్ కావడంతో నిప్పు రాజుకుని విషాదం చోటుసుకుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కుమారుడి మృతి గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందివచ్చిన బిడ్డ అలా సజీవదహనం అవ్వడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు.