నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) మరణం తెలుగు దేశం పార్టీకి, తెలుగు చిత్రసీమకు లోటు అని అభిమానులు, ప్రజలు చెబుతున్నారు. నలభై ఏళ్ళు కూడా నిండక మునుపే, చిన్న వయసులో ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళడం సామాన్యులను కూడా కలచివేస్తోంది. ఆయన మృతి నేపథ్యంలో ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేశారు. 


'మిస్టర్ తారక్' విడుదల వాయిదా
Mr Tarak Movie Release Postponed : నందమూరి తారక రత్న కథానాయకుడిగా నటించిన 'మిస్టర్ తారక్' సినిమాను ఈ నెల 24న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాను విడుదల చేయడం సరి కాదని వాయిదా వేసినట్లు చిత్ర దర్శక, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పేర్కొన్నారు.  


శంకర్ డోరా దర్శకత్వం వహించిన 'మిస్టర్ తారక్' సినిమాలో సారా కథానాయికగా నటించారు. ప్రతిజ్ఞ ప్రొడక్షన్స్ పతాకంపై మధు పూసల నిర్మించారు. మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ సినిమాగా 'మిస్టర్ తారక్' తెరకెక్కింది. 


ప్యారలల్ యూనివర్స్‌లో...
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య, ప్రాణ స్నేహితుడు ఒక్కటై మోసం చేస్తే... హీరో ఏం చేశాడు? అనేది చిత్ర కథగా తెలుస్తోంది. 'నేను నమ్ముకున్న వైఫ్ ఇంకొకడితో బెడ్ ఎక్కింది. కోరుకున్న లైఫ్ ఇలా రోడ్ ఎక్కింది' అంటూ ట్రైలర్‌లో తారక రత్న చెప్పిన డైలాగ్ సినిమా కోర్ పాయింట్ గురించి చెబుతోంది. తన భర్త కనిపించడం లేదంటూ భార్య ఎందుకు కంప్లైంట్ చేసింది? ఇంటికి వచ్చిన భర్తను ఎవరు నువ్వు? అని ఎందుకు ప్రశ్నించింది? ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా. ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ తీసుకుని సినిమా తెరకెక్కించినట్లు తెలిసింది. 


నిజానికి, మూడు నెలల క్రితమే 'మిస్టర్ తారక్' ట్రైలర్ విడుదలైంది. అమెరికాలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నారు. 


Also Read : తారకరత్న వారసులు ఎంత మందికి తెలుసు? చిన్న కుమార్తె, కొడుకు కూడా


బెంగళూరు నారాయణ హృదయాలయలో తారక రత్న తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన పార్థీవ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాదుకు తరలించారు. ప్రస్తుతం మోకిలాలోని తారక రత్న స్వగృహంలో కుటుంబ సభ్యుల సందర్శనార్థం ఉంచారు. అక్కడికి అభిమానులు, తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఎవరినీ రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. 


నివాళులు అర్పించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
మోకిలాలోని తారకరత్న నివాసానికి చేరుకున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సోదరునికి నివాళులు అర్పించారు. విజయ సాయి రెడ్డి కూడా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరూ మోకిలా చేరుకుంటున్నారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి, కుమార్తె నిష్క కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   


ఫిల్మ్ ఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం...
మోకిలాలోని ఇంటి నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఫిల్మ్ నగర్‌లో ఫిల్మ్ ఛాంబర్‌కు తారక రత్న భౌతిక కాయాన్ని తీసుకు రానున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానులు, ప్రేక్షకులు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానానికి అంతిమ యాత్ర మొదలు కానుంది. అక్కడ ఐదు గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


Also Read తారకరత్న సీక్రెట్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడు? ఫ్యామిలీతో గొడవలు ఏంటి? ఎవరీ అలేఖ్యా రెడ్డి?