నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) వారసులు ఎంత మంది? ఈ ప్రశ్నకు చాలా మంది చెప్పే సమాధానం ఒక్కటే... అమ్మాయి పేరు నిష్క. అవును... తారక రత్న, అలేఖ్యా రెడ్డి (Alekhya Reddy) దంపతులకు ఓ కుమార్తె ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే... ఆ అమ్మాయితో పాటు మరో ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.
 
నిష్క తర్వాత కవలలు!?
తారక రత్న సోషల్ మీడియా పేజీలు చూస్తే... ఎక్కువగా నిష్కతో దిగిన ఫోటోలు మాత్రమే కనిపిస్తాయి. మొదటి సంతానం గురించి ప్రేక్షకులకు తెలుసు. అయితే, నిష్క తర్వాత అలేఖ్యా రెడ్డి కవలలకు జన్మ ఇచ్చారు. కవల పిల్లల్లో ఒకరు అమ్మాయి కాగా... మరొకరు అబ్బాయి! వాళ్ళ వయసు తక్కువే. తండ్రి మరణం గురించి ఊహ తెలియని వయసులో చిన్నారులు ఇద్దరూ ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. తండ్రి పార్థీవ దేహాన్ని చూసి నిష్క కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 


మోకిలాలోని స్వగృహంలో తారకరత్న పార్థీవ దేహం
బెంగళూరు నారాయణ హృదయాలయలో తారక రత్న తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన పార్థీవ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాదుకు తరలించారు. ప్రస్తుతం మోకిలాలోని తారక రత్న స్వగృహంలో కుటుంబ సభ్యుల సందర్శనార్థం ఉంచారు. అక్కడికి అభిమానులు, తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఎవరినీ రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. 


ఫిల్మ్ ఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం...
మోకిలాలోని ఇంటి నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఫిల్మ్ నగర్‌లో ఫిల్మ్ ఛాంబర్‌కు తారక రత్న భౌతిక కాయాన్ని తీసుకు రానున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానులు, ప్రేక్షకులు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానానికి అంతిమ యాత్ర మొదలు కానుంది. అక్కడ ఐదు గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 


Also Read : తారకరత్నకు కలిసి రాని '9' - బ్యాడ్ సెంటిమెంట్?


తారకరత్న వయసు 39 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు తారకరత్న వెళ్ళిపోవడం నందమూరి అభిమానులను, తెలుగు దేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలచివేస్తోంది. తాతయ్య ఎన్టీఆర్ నట వారసత్వం అందుకుని 2002లో తారక రత్న చిత్రసీమలోకి వచ్చారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా సుమారు 25 సినిమాలు చేశారు. 


Also Read : తారకరత్న సీక్రెట్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడు? ఫ్యామిలీతో గొడవలు ఏంటి? ఎవరీ అలేఖ్యా రెడ్డి?


హీరోగా ఆశించిన రీతిలో తారక రత్న విజయాలు అందుకోలేదు. ప్రతినాయకుడిగా తొలి చిత్రం 'అమరావతి'తో నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు విరామం ఇచ్చారు. సినిమాల ఎంపికలో ఆయన ఆచితూచి అడుగులు వేసేవారు. గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ '9 అవర్స్'లో సీఐ రోల్ చేశారు. హీరోగా 'ఒకటో నంబర్ కుర్రాడు', 'యువ రత్న', 'భద్రాద్రి రాముడు', 'నందీశ్వరుడు' తదితర చిత్రాలు చేశారు. అయితే, ఇటీవల నటన కంటే ఎక్కువ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ విషయమై నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నుంచి అనుమతి కూడా లభించినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి.  పూర్తి స్థాయిలో రాజకీయాల్లో అడుగులు వేస్తున్న సమయంలో ఈ విధంగా జరిగింది.