Gyanvapi Mosque Case:


హిందువుల పిటిషన్‌పై సవాలు..


జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉన్న ప్రాంగణాన్ని పూర్తిగా హిందూ భక్తులకు అప్పగించాలన్న పిటిషన్‌ను సవాలు చేస్తూ అంజుమాన్ ఇస్లామియా మజీద్ కమిటీ వేసిన పిటిషన్‌ను వారణాసి కోర్టు కొట్టివేసింది. విశ్వేశ్వర్ విరాజ్‌మాన్‌ భక్తులు కోర్టులో పిటిషన్ వేశారు. అటు విశ్వవేదిక్ సనాతన్ సంఘ్‌ కూడా దీనికి మద్దతునిచ్చింది. "మసీదు ప్రాంగణమంతా హిందువులకు అప్పగించాలి. మసీదులో బయట పడ్డ శివలింగానికి పూజలు చేసుకునేందుకు అనుమతినివ్వాలి" అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే...అటు ముస్లింలు మాత్రం ఇది మసీదు నిర్మాణంలో ఓ శకలం అని చెబుతున్నారు. అక్టోబర్ 15నే  ఈ రెండు వర్గాల వాదనలు విన్న వారణాసి కోర్టు...ఇన్నాళ్లు ఈ కేసుని పెండింగ్‌లో ఉంచింది. నవంబర్ 8వ తేదీనే ఆర్డర్లు రావాల్సి ఉన్నా...కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. హిందువుల తరపున పిటిషన్ వేసిన కిరణ్ సింగ్...ముస్లింలకు ఆ మసీదులోకి అనుమతినివ్వకుండా చూడాలని అన్నారు. పూర్తిగా హిందువులకు అప్పగించి అందులోని శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతినివ్వాలని కోరారు. అటు ముస్లింలు దీన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేయగా...వారణాకి కోర్టు కొట్టి వేసింది. వారణాసి జిల్లా కోర్టు గతంలోనే సంచలన తీర్పు ఇచ్చింది. మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్​పై సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టివేసింది. 






ఇదీ కేసు..


జ్ఞాన్​వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్‌ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు. దీంతో జ్ఞాన్​వాపి మసీదు- శృంగార్‌ గౌరీ ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ప్రార్థన స్థలంలోని భూగర్భ నేలమాళిగలు, చెరువు, మూడు గోపురాలను సర్వే బృందం వీడియో తీసింది. అయితే మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ సర్వే నివేదికను అడ్వకేట్‌ కమిషనర్ కోర్టులో సమర్పించారు. అయితే అది శివలింగం కాదంటూ మసీద్‌ కమిటీ వాదిస్తోంది.  ఈ వ్యవహారం తర్వాత సుప్రీం కోర్టుకు చేరింది. అయితే జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసును ఉత్తర్‌ప్రదేశ్‌ జుడీషియల్ సర్వీసులో ఉన్న అత్యంత సీనియర్, అనుభవమున్న న్యాయమూర్తి విచారిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. అలానే మసీదులో సీల్ వేసిన ప్రాంతాన్ని అలానే ఉంచాలని ఆదేశించింది. ముస్లింలు యథావిధిగా మసీదు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసుపై ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని సుప్రీం పేర్కొంది. ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది.


Also Read: Stubble Management: పొలాల్లో గడ్డి కాల్చితే ఒక్క గింజ కూడా కొనం, రైతులకు బిహార్ ప్రభుత్వం వార్నింగ్