Rahul Gandhi on Social Media:
పక్షపాతమెందుకు: రాహుల్
సోషల్ మీడియాపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎన్నికల్లో ఏ పార్టీనైనా గెలిపించే సామర్థ్యం సోషల్ మీడియాకి ఉంది" అని అన్నారు. "ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ సెక్యూర్ అయినప్పటికీ..భారత్‌లోని ఎన్నికలన్నీ సోషల్ మీడియాపైనే ఆధారపడి ఉంటున్నాయి" అని వ్యాఖ్యానించారు. కావాలనే కొందరి అకౌంట్స్‌పై పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపించిన ఆయన...తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అందుకు ఉదాహరణ అని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు రాహుల్ గాంధీ. అక్కడ జరిగిన ఓ మీటింగ్‌లో ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడే కాదు. గతంలోనూ చాలా సార్లు సోషల్ మీడియాపై ఆరోపణలు చేశారు రాహుల్. ఈ ఏడాది జనవరిలో ట్విటర్ గురించి మాట్లాడారు. "నాకు ట్విటర్‌లో ఫాలోవర్లు పెరగకుండా చూడాలని కేంద్రం ఆ కంపెనీపై ఒత్తిడి తీసుకొస్తోంది" అని ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అప్పటి ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు లేఖరాశానని చెప్పారు రాహుల్. తనకు ట్విటర్‌లో 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉండేవారని, రోజుకు కనీసం 8-10 వేల మంది యాడ్ అయ్యే వారని వివరించారు. "నా ట్విటర్ హ్యాండిల్‌లో ఏదో జరుగుతోంది. 2021 ఆగస్టు నుంచి నా ట్విటర్‌కు సంబంధించిన యావరేజ్ ఫాలోవర్ల సంఖ్య జీరోకి పడిపోయింది. ఎవరో నా అకౌంట్‌ను వెనకుండి నడిపిస్తున్నారని అనిపిస్తోంది" అని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు. తన అకౌంట్ ఇలా కాకముందు తాను కేంద్రానికి వ్యతిరేకంగా ఎన్నో మాట్లాడానని చెప్పారు. అందుకే...తన అకౌంట్‌ని అలా నియంత్రిస్తున్నారని ఆరోపిస్తున్నారు. "దళిత యువతి అత్యాచారం, రైతుల ఉద్యమం, మానవ హక్కుల ఉల్లంఘన లాంటి సమస్యలపై నేను ట్విటర్ ద్వారా అభిప్రాయాలు తెలియజేశాను. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడాను" అని వివరించారు.
ట్విటర్ లాక్..
గతేడాది ఆగస్ట్‌లో రాహుల్ గాంధీ ట్విటర్ అకౌంట్‌ను కొన్ని రోజుల పాటు బ్లాక్ చేశారు. దళిత యువతి అత్యాచారం గురించి ప్రస్తావిస్తూ బాధితురాలి ఫోటోన్ ట్విటర్‌లో షేర్ చేశారు రాహుల్. వెంటనే అలర్ట్ అయిన ట్విటర్ టీమ్...ఆయన అకౌంట్‌ను లాక్ చేసింది. వారం రోజుల తరవాత రీస్టోర్ చేసింది. దీనిపైనా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను షేర్ చేసిన ఫోటోని...కొన్ని ప్రభుత్వం సంస్థలూ షేర్ చేశాయని, కానీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. కొందరు దేశంలో మత సామరస్యాన్ని తుడిచి పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, దీన్నో ఆయుధంగా మార్చుకుంటున్నాయని బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు.
జోడో యాత్రలో బిజీబిజీ..
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఈ యాత్ర పూర్తికాగా ఇప్పుడు మహారాష్ట్రలో కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే..హింగోలి జిల్లాలోని కలమ్‌నురి ప్రాంతంలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. స్టేజ్‌పై డ్రమ్స్ వాయిస్తున్న కళాకారుల వద్దకు వెళ్లి తానూ కాసేపు డ్రమ్స్ వాయించారు. ఆ తరవాత ఆ కళాకారులకు షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకున్నారు.
Also Read: Illegal Mining Case: 'నేనేమైనా దేశం విడిచి పోతానా?'- ఈడీ ముందుకు ఝార్ఖండ్ సీఎం!