Steve Jobs Sandals: ఆ పాత చెప్పుల ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.1.77 కోట్లు. అవాక్కయ్యారా? అంతేకాదు ఆ పాత చెప్పులను వేలం పాటలో దక్కించుకున్నారు. అవేమైనా వజ్రాలతో చేసిన చెప్పులా? అని ఆలోచించకండి. ఆ పాత పాదరక్షలు.. యాపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌వి.






వేలంపాటలో


స్టీవ్‌ జాబ్స్‌ పాత చెప్పులను ఇటీవల వేలం వేశారు. అందులో 2 లక్షల 18వేల అమెరికన్‌ డాలర్లకు (సుమారు రూ.1 కోటి 77 లక్షలు) వాటిని ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. అయితే అంచనా వేసిన దానికంటే ఎన్నో రెట్లకు స్టీవ్‌ జాబ్స్‌ పాత చెప్పులు అమ్ముడు పోయినట్లు వేలం వేసిన సంస్థ వెల్లడించింది. వేలంలో వాటికి 60వేల డాలర్లు వస్తాయని ఊహించగా.. రికార్డు స్థాయిలో 2,18,750 డాలర్లకు అవి అమ్ముడు పోయాయి. అయితే, వాటిని కొన్న వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.


అమెరికాకు చెందిన జూలియన్స్‌ అనే సంస్థ పలు వస్తువులను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టింది. అందులో స్టీవ్‌ జాబ్స్‌ వాడిన బిర్కెన్‌స్టాక్‌ ఆరొజోనా కంపెనీకి చెందిన లెదర్‌ చెప్పులను ఉంచింది.


ఆనాడు


1970, 80 దశకంలో యాపిల్‌ కంప్యూటర్‌ రూపొందించే కీలక సమయాల్లో స్టీవ్‌జాబ్స్‌ వీటిని వాడారని తెలిపింది కొన్నేళ్లపాటు వాడినందున వాటిపై ఆయన కాలి ముద్రలు స్పష్టంగా ఉన్నాయని వివరించింది. 


స్టీవ్‌ జాబ్స్‌, స్టీవ్‌ వోజ్‌నియాక్‌లు కలిసి కాలిఫోర్నియాలో 1976లో యాపిల్‌ సంస్థను స్థాపించారు. అనంతరం కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్‌లలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా యాపిల్‌ ఎదిగింది. 


Also Read: G20 Summit 2022: జిన్‌పింగ్‌కు కెనడా ప్రధాని స్ట్రాంగ్ కౌంటర్- డైలాగ్ వార్ లీక్!