AP Minister Rajini: ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన చోట్ల గంటల లెక్క విధానంలో వైద్యులను నియమించుకోవాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపాలని ఉన్నతాధికారులకు మంత్రి విడదల రజినీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ఆస్పత్రుల్లో అనస్థీషియా వైద్యులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - పీహెచ్సీల్లో 572 స్టాఫ్ నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంత్రి సూచించారు. బుధవారం మంగళగిరిలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం పురోగతిపై మంత్రి విడదల రజినీ సమీక్ష నిర్వహించారు.
"ప్రజల నుండి విశేషస్పందన"
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ ను సమర్థంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై అధికారులు నిరంతరం కసరత్తు చేయాలని మంత్రి ఆదేశించారు. అక్టోబర్ 21 వ తేదీ నుండి ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రయల్ న్ ప్రారంభం అయిందని, అప్పటి నుండి ఈ పథకానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి సంబంధించి తాను స్వయంగా ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. వారి నుండి అద్భుతమైన స్పందన కనిపిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 97,011 మంది బీపీ బాధితులు, 66,046 మధుమేహ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మూడు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల 733 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లకు రెండు సార్లు 104 మొబైల్ మెడికల్ యూనిట్ - ఎంఎంయూ వాహనాలు వెళ్లాయని, సిబ్బంది గ్రామాలకే వెళ్లి వైద్య పరీక్షల సేవలు అందించారని పేర్కొన్నారు. మరో 4 వేల 267 విలేజ్ హెల్త్ క్లినిక్ లకు 104 ఎంఎంయూ వాహనాలు ఒకసారి వెళ్లాయని వివరించారు.
"ఖాళీలన్నీ భర్తీ చేశాం"
రాష్ట్ర వైద్య రంగానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం తాపత్రయ పడుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. వైద్య రంగ అభివృద్ధికి సీఎం ఎంతో కృషి చేస్తున్నారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయంలో అండర్ గ్రాడ్యూయేట్ విద్యార్థులకు రీసెర్చ్ ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. వైద్య శాఖలో ఒక్క ఖాళీ కూడా లేకుండా పెద్ద ఎత్తున భర్తీ చేశామని ఈ క్రమంలో మంత్రి విడదల రజినీ వెల్లడించారు. వైఎస్సార్ హల్త్ వర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సైతం పరిశోధనల్లో ప్రోత్సహించడం ప్రశంసనీయమని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఈ రీసెర్చ్ ఫలితాలు గ్రామీణ ప్రజలకు సైతం అందాలని పేర్కొన్నారు.