సూపర్‌ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ పద్మాలయ స్టూడియోకు చేరుకున్న జగన్... దిగ్గజనటుడి పార్థివదేహాన్ని సందర్శించారు. ఆయనకు నివాళి అర్పించిన తర్వాత మహేష్‌ బాబు ఫ్యామిలీని ఓదార్చారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. కాసేపు వారితో మాట్లాడారు. సుమారు 15 నిమిషాల పాటు అక్కడ ఉన్న జగన్ తర్వాత తిరుగు పయనమయ్యారు.


జగన్, బాలకృష్ణ పలకరింపులు


కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించే టైంలో నందమూరి బాలకృష్ణ కూడా అక్కడే ఉన్నారు. మహేష్‌బాబు, ఆయన ఫ్యామిలీతో మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి బాలకృష్ణకు కూడా పలకరించారు. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


సీఎం జగన్ మోహన్ రెడ్డితో పలువురు మంత్రులు,  పార్టీ లీడర్లు కూడా కృష్ణ భౌతిక కాయానికి అంజలి ఘటించారు. 






కృష్ణ తుది శ్వాస విడిచినప్పుడు కూడా సీఎం జగన్ ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు. తెలుగువారి సూపర్ స్టార్ కృష్ణ అని... ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్ అని కామెంట్ పెట్టారు. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. 


 






తెలుగు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు కాసేపట్లో అధికార లాంఛనాలతో హైదరాబాదులోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. సోమవారం ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసారు ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు ఆయన మృతదేహాన్ని సందర్శించారు ఘనంగా నివాళులు అర్పించారు. అభిమానుల సందర్శనం కోసం ఇప్పటి వరకు పద్మాలయా స్టూడియోస్ లో పార్థివదేహం ఉంచారు. కాసేపట్లో మహాప్రస్థానానికి పార్థివదేహం తరలించి ప్రభుత్వ అధికారులు అంచనాలతో అంత్యక్రియలు నిర్వహించినున్నారు.