Gujarat Election 2022:


సౌరాష్ట్ర నుంచి..


హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు జాతీయ రాజకీయాల ఫోకస్ గుజరాత్‌పైనే ఉంది. బీజేపీయేతర పార్టీలన్నీ...గుజరాత్‌లో ఆ పార్టీ ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్నాయి. ఆప్‌, కాంగ్రెస్ అయితే ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ కాషాయ జెండా ఎగురుతోంది. అంత సులువుగా ఈ పార్టీని ఓడించటం సాధ్యం కాదని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే...ప్రచారంలో మాత్రం ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా..బీజేపీ స్పీడ్ పెంచేసేంది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావటం వల్ల ఆయన ఈ ఎన్నికల్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పలుసార్లు రాష్ట్రంలో పర్యటించి అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ప్రచారంలోనూ వేగం పెంచేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 20 అధికారికంగా ప్రచారం కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.సౌరాష్ట్రలో మూడు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది బీజేపీ. వీటితో పాటు దాదాపు 30 వరకూ ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంది. 


సౌరాష్ట్ర నుంచే ఎందుకు..? 


గుజరాత్‌లో సౌరాష్ట్ర ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మొత్తం 182 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో...ఒక్క సౌరాష్ట్రలోని 48 నియోజక వర్గాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే...ఈ 48 సీట్లలో గెలవటం చాలా కీలకం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే...ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా పాటిదార్‌లు, ఓబీసీ వర్గానికి చెందిన వాళ్లుంటారు. గత ఎన్నికల్లో బీజేపీ పాటీదార్ల ఓటు బ్యాంకుని దక్కించు కోవడంలో విఫలమైంది. అప్పుడు కాంగ్రెస్‌కు ఆ ఓట్లన్నీ వెళ్లిపోయాయి. ఇప్పుడదే రిపీట్‌ కాకుండా చూసేందుకు బీజేపీ జాగ్రత్త పడుతోంది. అందుకే...ఈ ప్రాంతం నుంచే ప్రచారం మొదలు పెట్టనుంది. అందులోనూ ఈ సారి పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఆ మేరకు కొంత వరకూ బీజేపీ వైపు సానుకూలత ఉండే అవకాశముంది. గత ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ ఏదో నెట్టుకొచ్చింది కానీ...ఈ సారి మాత్రం ఈ ప్రాంతంపై పట్టు సాధిస్తాం అని బీజేపీ సీనియర్ నేతలు చాలా ధీమాగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో పాటిదార్ ఉద్యమం కారణంగా...బీజేపీపై వ్యతిరేకత పెరిగి అందరూ కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ఫలితంగా...చెప్పుకోదగ్గ సీట్లు సాధించింది
ఆ పార్టీ. ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు తక్కువేనంటున్నారు. ఇక బీజేపీని ఢీకొట్టేందుకు రెడీ అవుతున్న ఆప్ కూడా పాటిదార్ వర్గానికి చెందిన నేతనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి..బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టింది. ఈ రకంగా చూస్తే...బీజేపీపై ఇంకా వ్యతిరేకత ఉన్న పాటిదార్ వర్గ ఓటర్లు...ఆప్‌ వైపు మళ్లే అవకాశాలు లేకపోలేదు. ఇదే జరిగితే...బీజేపీకి ఆ మేర నష్టం తప్పదు. సౌరాష్ట్రలోని 48 నియోజకవర్గాల్లో 25కి మించి సీట్లలో గెలుస్తామని చాలా గట్టిగా చెబుతోంది ఆప్. ఇది చెప్పినంత సులువైతే కాదు. బీజేపీ క్యాడర్ బలంగా ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. 


Also Read: G20 Summit: G20 లో మోదీ లేకుండానే అమెరికా ఎమర్జెన్సీ మీటింగ్, ఎందుకు పక్కన పెట్టారు?