చర్మం పొడి బారడం వల్ల, అలెర్జీల వల్ల దురద వేస్తుంది. కాసేపటికే పోతుంది. కానీ కొంత మందిలో మాత్రం దీర్ఘకాలికంగా ఉంటుంది. రోజుల తరబడి ఆ దురద పోదు. ఎందుకు వస్తుందో కూడా అర్థం కాక తలపట్టుకుంటారు చాలా మంది. కానీ ఈ దురద క్యాన్సర్ సంకేతం కావచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇలా దురద స్థిరంగా, దీర్ఘకాలికంగా వస్తుందంటే దానికి ఒక నిర్ధిష్ట వైద్య అత్యవసర పరిస్థితి ఉందని అర్థం. ఆరోగ్యనిపుణులు చెబుతున్న ప్రకారం చర్మం దురదతో పాటూ, ఇతర లక్షణాలు కనిపిస్తే అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణం కావచ్చు. 


ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే...
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ వల్ల కామెర్లతో బాధపడేవారు తరచుగా దురదతో బాదపడతారు.శరీరంలో పిత్తాశయంలో బిలిరుబిన్ పేరుకుపోవడం వల్ల చర్మం, కళ్లు పసుపు రంగులోని మారిపోతాయి. పిత్తం అనేది కాలేయంలో తయారవుతుంది. అది అక్కడ్నించి చిన్న పేగుల్లోకి విడుదలవుతుంది. అయితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు కాలేయం పిత్తాన్ని విడుదల చేయకుండా క్యాన్సర్ కణితులు అడ్డుకుంటాయి. ఇలా జరిగినప్పుడు కాలేయం ఉత్పత్తి చేసిన పిత్తం పేరుకుపోవడం మొదలవుతుంది. ఇది చివరకి రక్తంలో కలుస్తుంది. అప్పుడు శరీరం పసుపు రంగులోకి మారి దురదలు మొదలవుతాయి. అందుకే దురదలను తక్కువ అంచనా వేయకూడదు. 


ఉపశమనం ఎలా
దురదలు అధికంగా వేస్తున్నప్పుడు కాసేపు గోక్కొని వదిలేయకూడదు. ఎందుకు అంతగా దురదలు వస్తున్నాయో తెలుసుకోవాలి. వైద్యులు మొదట యాంటీ కాలమైన్ వంటి లోషన్లను సూచిస్తారు. అలాగే దురదలకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. 


ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు
పొత్తి కడుపులో ఉండే ఒక అవయవం ప్యాంక్రియాటిస్. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. తద్వారా శక్తిగా మారుస్తుంది. పాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్న వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. 
1. పొత్తికడుపులో నొప్పి
2. బరువు తగ్గడం
3. ఆకలి లేకపోవడం
4. కామెర్లు
5. వికారం 
6. మలం రంగులు మారడం


కాబట్టి దురద అనేది చిన్న సమస్యగా తీసిపారేయవద్దు. అది ప్యాంక్సియాటిక్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యకు కారణం కావచ్చు. 


Also read: సైనసైటిస్ రావడానికి ఎన్నో కారణాలు, అందులో ధూమపానం కూడా ఒకటి - చికిత్స ఇలా






















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.