పోషకాల పవర్ హౌస్ కివీ. కొంచెం పుల్లగా, మరి కొంచెం తియ్యగా ఉండే కివీ ఇప్పుడు అందరూ తినడానికి ఇష్టపడుతున్నారు. కివీస్ పండ్లలో పొటాషియం, కాపర్, విటమిన్ కె, ఫోలేట్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. రోగనిరోధక శక్తి ఇవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కేలరీలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వు తక్కువ, ఫైబర్ అధికం. ఇది తినడం వల్ల శరీరం తాజాదనంగా ఉంటుంది. శీతాకాలంలో దొరికే అద్భుతమైన పోషకాలు నిండిన పండు ఇది. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొండటం కోసం దీన్ని రోజువారీ డైట్లో భాగం చేసుకోవాల్సిందే.
ఫైబర్ అధికం: కివీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ వంటి అనేక వ్యాధులని నివారించడంలో సహాయపడుతుంది. రక్తపోటుని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచుతుంది. అందుకే మధుమేహులు కూడా ఎటువంటి భయాలు పెట్టుకోకుండా దీన్ని తీసుకోవాడచ్చు. బరువు తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. హృదయ సంబంధ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది.
జీర్ణక్రియకి సహాయకారి: జీర్ణక్రియకి ఎంతో మేలు చేస్తుంది. కివీలో ఎంజైమ్ లు శరీరంలోని ప్రోటీన్ల జీర్ణక్రియలో సహాయపడతాయి. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడుతున్న వారికి సహాయపడుతుంది. ఇతర జీర్ణాశయంతర సమస్యల్ని తొలగిస్తుంది.
విటమిన్ సి పుష్కలం: విటమిన్ సి అనగానే నారింజ, నిమ్మకాయలే ఎక్కువగా అందరికీ గుర్తుకు వస్తాయి. కానీ వాటిల్లో కంటే రెండింతలు కివీలో అధికంగా విటమిన్ సి లభిస్తుంది. ఉందులో వాటి కంటే 154 శాతం విటమిన్ సి ఉంటుంది. రోగనిరోధక శక్తని పెంచడంలో సహాయపడుతుంది.. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచి చర్మాన్ని రక్షిస్తుంది. జుట్టుకు మేలు చేస్తుంది.
నాణ్యమైన నిద్ర ఇస్తుంది: కివీస్ లో సెరోటోనిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది మానసిక స్థితి మెరుగుపరిచి నిద్ర నాణ్యతని పెంచుతుంది. గురక కూడా తగ్గిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలో ఉండే కెరొటీనాయిడ్స్ కంటి చూపు మెరుగుపరిచేందుకు దోహదపడతాయి. కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
క్యాన్సర్ కణాలని నివారిస్తుంది: ఫైబర్, ఫైటో కెమికల్స్ అవయవాల పనితీరుని ప్రోత్సహిస్తాయి. పొట్ట, పేగులు, పెద్ద పేగు క్యాన్సర్ లని నివారించడానికి సహాయపడతాయి.
గుండెకి రక్షణ: రక్తంలో కొవ్వు (ట్రైగ్లిజరైడ్స్) మొత్తాన్ని తగ్గించడానికి, గుండె, రక్త నాళాలను రక్షించడానికి కివి ఉత్తమ ఎంపిక. విటమిన్ సి, పాలీఫెనాల్స్, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. గుండెని భద్రంగా ఉండేలా చేస్తుంది.
డెంగ్యూపై పోరాడుతోంది: పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. కివీ చాలా సులభంగా జీర్ణమవుతుంది. యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్, పొటాషియం ఇందులో మెండుగా ఉంటాయి. డెంగ్యూని ఎదుర్కోడానికి బాగా పని చేస్తుంది. అటువంటి సమయంలో దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ బి 9 ను అందిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: 10 నిమిషాల్లో 12 ఎనర్జీ డ్రింక్స్ తాగాడు! తర్వాత అతనికి ఏమైందో తెలుసా?