ఫ్రెండ్స్ తో సరదాగా ఏదైనా విషయంలో చిన్న చిన్న బెట్టింగ్స్ కట్టడం చూస్తూనే ఉంటారు. అటువంటి వాటిలో గెలవడం అనేది కొంతమంది జోక్ గా తీసుకుంటే మరికొంతమంది మాత్రం ప్రిస్టేజ్ గా ఫీల్ అవుతారు. ఒడిపోతే తట్టుకోలేరు. ఎంతటి ప్రమాదకరమైన ఆ ఛాలెంజ్ చెయ్యడానికి సిద్ధపడతారు. చివరకి తమ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేసుకుంటారు. అచ్చం అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కూడా చేశాడు. తన ఫ్రెండ్స్ ముందు గొప్పగా ఉండాలని భావించిన ఒక అమెరికన్ కేవలం 10 నిమిషాల్లో 12 ఎనర్జీ డ్రింక్స్ తాగాడు. చివరకి అది తనని చావు అంచుల వరకి తీసుకుని వెళ్ళింది.
అమెరికాకి చెందిన 36 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. 10 నిమిషాల్లో 12 ఎనర్జీ డ్రింక్స్ తాగాడు. మరుసటి రోజు అతను తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. వెంటనే హాస్పిటల్ కి వెళ్ళగా అధిక చక్కెర, కెఫీన్, రసాయనాలు తీసుకోవడం వల్ల క్లోమ గ్రంథి దెబ్బతిన్నదని వైద్యులు చెప్పారు. దాని వల్ల అతని అవయవాలు, కడుపు అంతా చెడిపోయింది. వాంతులు, విరోచనాలు, రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోవడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఒకేసారి వచ్చి పడ్డాయి. అతను అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ బారిన పడినట్లు వైద్యులు తేల్చారు. చావు అంచుల వరకి వెళ్ళాడు. డాక్టర్స్ ఎంతగానో కష్టపడి అతనికి శస్త్ర చికిత్స చేసి నిరంతరంగా యాంటీ బయాటిక్స్ ఉపయోగించారు. దీంతో అతను కొద్దిగా కోలుకున్నాడు. కానీ తర్వాత కూడా ఇతర అనారోగ్య సమస్యలు అతన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.
అసలు ఎనర్జీ డ్రింక్ అంటే ఏంటి?
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఎనర్జీ డ్రింక్ అనేది సాధారణంగా పెద్ద మొత్తంలో కెఫిన్, చక్కెరలు, గ్వారానా, టౌరిన్, ఎల్ కార్నిటైన్ అనే రసాయనాలతో నిండి ఉంది. ఇవి చురుకుదనం, రక్తపోటు, హృదయ స్పందన రేటు, శ్వాస వేగాన్ని పెంచుతాయి. తక్షణ శక్తిని అందిస్తాయి. మెదడు పనితీరుని ఉత్తేజపరిచి, ఏకాగ్రతని పెంచుతాయి. దాదాపు అన్ని ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ పెద్ద మొత్తంలో ఉంటుంది. హెల్త్‌లైన్ ప్రకారం 12-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 31 శాతం మంది క్రమం తప్పకుండా ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటారు. కానీ ఇటువంటివి పిల్లలు తీసుకోకూడదు. అది ఆరోగ్యానికి హానికరం. ఇవి అతిగా తాగడం వల్ల వాటికి బానిసలుగా మారే ప్రమాదం ఉంది. గుండె, మెదడుపై కూడా ప్రతికూల ప్రభావాలు చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎనర్జీ డ్రింక్స్ వల్ల వచ్చే అనార్థాలు
గుండెకి చేటు
ఎనర్జీ డ్రింక్స్ పనితీరుపై పలు అధ్యయనాలు జరిగాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి, అలిసిపోయినప్పుడు తక్షణ శక్తిని ఇస్తుందని సూచిస్తున్నాయి. కానీ ఇవి గుండె సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదని కూడా హెచ్చరిస్తున్నాయి.
రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల
కొన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్ అధిక మొత్తంలో చక్కరతో నిండి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతాయి. మధుమేహంతో బాధపడే వాళ్ళు వీటిని అస్సలు తీసుకోకూడదు. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల దీర్ఘకాలిక వ్యాధులకి దారి తీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
మద్యంతో మిక్సింగ్ మహా డేంజర్
యువత ఎనర్జీ డ్రింక్ ఆల్కహాల్ లో మిక్స్ చేయడం బాగా చేస్తున్నారు. కానీ ఇది శరీరంపై ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఇతర వ్యాధులకి దారి తీస్తుంది.
డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది
ఎనర్జీ డ్రింక్స్ ఎలక్ట్రోలైట్ లేనివి. రక్తప్రవాహంలోకి ప్రవేశించే చక్కెరని కరిగించడానికి కెఫీన్ శరీరం నుంచి నీటిని విసర్జిస్తుంది. దీని వల్ల శరీరం బాగా డీహైడ్రేట్ కు దారితీస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ఈ ఐదు నూనెలు కలిపి రాశారంటే పొడవాటి జుట్టు మీ సొంతం