IPL Player Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడబోతున్న యంగెస్ట్ క్రికెటర్ గా రికార్డుల్లోకెక్కిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. షార్జాలో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్్ లో చెలరేగాడు. యూఏఈతో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి 46 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. 165కి పైగా స్ట్రైక్ రేటుతో సూర్యవంశీ పరుగులు సాధించడం విశేషం. మరో ఎపెనర్ ఆయుష్ మాత్రే 51 బంతుల్లో 67 పరుగులతో అజేయంగా నిలిచి, యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టీమిండియా పది వికెట్లతో ఘనవిజయం సాధించింది. 


కసితో బ్యాటింగ్..
అతడు సినిమాలో చెప్పినట్లుగా మొక్కకు అంటుకట్టినట్లుగా, గోడ కట్టినట్లుగా శ్రద్ధగా సిక్సులతో సూర్యవంశీ చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే టోర్నీ పాకిస్థాన్, జపాన్ లతో జరిగిన రెండు మ్యాచ్ ల్లలో విఫలమైన సూర్యవంశీ.. ఈ మ్యాచ్ లో మాత్రం తన తడాఖాను చూపెట్టాడు. ఆరు భారీ సిక్సర్లు, మూడు చూడ చక్కని ఫోర్లతో అలరించాడు. మైదానం నలువైపులా షాట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ లాఫ్టేడ్ షాట్లతో భారీ సిక్సర్లతో విరుచుకు పడి, అభిమానులకు పైసా వసూల్ అనిపించాడు. సూర్యవంశీ వీర విహారంతో భారత్ కేవలం 17వ ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో గెలవడంతో భారత్.. సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 






కుప్పకూల్చిన బౌలర్లు.. 
అంతకుమందు తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ భారత బౌలర్ల ధాటికి 44 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. జట్టులో మహ్మద్ రియాన్ 48 బంతుల్లో 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో యుదజిత్ గుహా మూడు వికెట్లు తీయగా, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లతో రాణించారు. నిజానికి ఈ మ్యాచ్ లో ప్రణాళిక బద్ధంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ప్రత్యర్థి చిత్తయ్యింది.


Also Read: Jasprit Bumrah: టీమిండియా గోల్డెన్ ఆర్మ్ బుమ్రా, క్రికెట్ ప్రపంచం కళ్లన్నీ ఈ స్టార్ పైనే


13 ఏళ్లకే ఐపీఎల్లోకి...
అంతకుముందు గతనెలలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సూర్యవంశీ సంచలనం నమోదు చేసిన సంగతి తెలిసిందే. 13 ఏళ్ల ఈ బీహార్ యువ కెరటాన్ని.. రూ.1 కోటి 10 లక్షలు వెచ్చించి, మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. దీంతో ప్రస్తుత ఆటతీరుతో తమపై రాజస్థాన్ పెట్టుకున్న నమ్మకం కరెక్టేనని సూర్యవంశీ నిరూపించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి 2008లో జరిగిన తొలి సీజన్ లో విజేతగా నిలిచిన రాజస్థాన్.. అప్పటి నుంచి టైటిల్ అందని ద్రాక్ష మాదిరిగా ఊరిస్తూనే ఉంది. మధ్యలో ఒకసారి ఫైనల్లోకి వెళ్లినా, ముంబై ఇండియన్ చేతిలో భంగపడింది. దీంతో ఈసారి లోకల్ ట్యాలెంట్ ను చేరదీసి, మళ్లీ విజేతగా నిలవాలని రాజస్థాన్ భావిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.



మరోవైపు గతనెలలో జరిగిన మెగా వేలంలో సంచలనాలు నమోదైన సంగతి తెలిసిందే. భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్  టోర్నీలోనే అత్యధిక ధర పలికాడు. రూ. 27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకోగా, శ్రేయస్ అయ్యార్ రూ. 26 కోట్లకుపైగా వెచ్చించి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో వీరిద్దరే ఇప్పటివరకు హయ్యెస్ట్ పెయిడ్ క్రికెటర్లు కావడం గమనార్హం.