ములుగు: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ (29) ఆత్మహత్య ఘటనలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ముళ్లకట్ట అంతర్రాష్ట్ర వంతెన పక్కనే ఉన్న ప్రైవేట్‌ రిసార్టులో ఎస్సై హరీశ్‌ సోమవారం ఉదయం తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఆ సమయంలో ఎస్సై హరీష్ గదిలో ఓ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 


ప్రేమ పేరుతో యువకులకు దగ్గరై..
రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న హరీశ్‌ మృతదేహంపై ఓ యువతి పడి రోదించిన ఫొటోలు, వీడియోలు సైతం వైరల్‌ అయ్యాయి. ఈ ఘటన తరవాత పేరూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంఘటన ఎలా జరిగింది? ఆ సమయంలో అక్కడ ఆమె ఎందుకు ఉందనే అంశాలపై విచారించారు. ఈ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన యువతిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో ముగ్గురు యువకులకు ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి చేసి, వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్లు తేలింది.


ఈమె వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, అతడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదైనట్లు సమాచారం. సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్లు, డబ్బు ఉన్నవాళ్ళు లక్ష్యంగా చేసుకుని లొంగదీసుకోవడమే యువతి టార్గెట్ అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో గత ఏడాది ఎస్సై హరీశ్‌కు ఫోన్‌లో యువతి కాంటాక్ట్‌ అయినట్లు సమాచారం. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారితీసింది. మెల్లగా ఆమె సంగతి తెలియడంతో పెళ్లికి ఎస్సై హరీశ్‌ నిరాకరించాడని సమాచారం. 
గర్భవతినని యువతి బెదిరించడంతో ఎస్సై ఆత్మహత్య
ఈ క్రమంలోనే ఎస్సై హరీశ్‌ కుటుంబసభ్యులు చూసిన సంబంధానికి ఓకే చెప్పి, వేరే యువతిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. కానీ తనను పెళ్లి చేసుకోకుంటే రోడ్డుకీడుస్తానని, ఇప్పుడు తాను గర్భవతినని ఎస్సై హరీశ్‌ను భయపెట్టడంతో తీవ్ర ఆందోళనకు గురై, ఎక్కడ పరువుపోతుందోననే బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎస్సై హరీశ్‌ మృతిపై తొలుత అనేక ఊహాగానాలు వినిపించాయి. ఉన్నతాధికారుల వేధింపులు, పని ఒత్తిడి అంటూ ప్రచారం జరిగింది. ఆయన మరణానికి దారి తీసిన పరిస్థితులను నిగ్గుతేల్చేందుకు పోలీసు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట యువతి అసలు బండారం బయటపడింది.



ఎస్సై హరీష్ చావుకు కారణం అవ్వడంతో పాటు గతంలో పలువురు యువకులను యువతి మోసం చేసిందని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హరీశ్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, ఫోటోలతో పాటు, యువతి క్రైం హిస్టరీపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు సమాచారం. కీలాడీ లేడి బాధితులు ఇంకా ఎవరున్నారు. ఎస్సైతో పరిచయం ఎలా వాడుకుంది. డిపార్ట్మెంట్ ను అడ్డుపెట్టుకుని ఎవరెవరని బెదిరించింది అనే కోణంలో కూపీ లాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కేసు కావడం, డిపార్ట్మెంట్ వేధింపులు అంటూ ఉన్నతాధికారులపై ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు మరింత వేగవంతం చేశారు.



Also Read: Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్