Uttarakhand High Court:


ఉత్తరాఖండ్‌లో ఘటన..


ఉత్తరాఖండ్‌లో ఓ హిందూ యువతి మసీదులో ప్రార్థనలు చేసింది. అప్పటి నుంచి ఆమెకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. 
కొన్ని హిందూ సంస్థలు ఆమెను చంపేస్తామంటూ బెదిరించాయి. ఏం చేయాలో తెలియక హైకోర్టుని ఆశ్రయించింది ఆ యువతి. తనకు రక్షణ కల్పించాలని పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు...ఆమెకు ప్రొటెక్షన్ కల్పించింది. అయితే...హిందూ అయ్యుండి మసీదులో నమాజ్‌ ఎందుకు చేశావంటూ కోర్టు ఆ యువతిని ప్రశ్నించింది. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తితో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నానని వెల్లడించింది. తనకు మతం మారడం ఇష్టం లేదని, కానీ నమాజ్ చేయడానికి అంగీకరించినట్టు చెప్పింది. ఇద్దరం పెళ్లి చేసుకున్నామని, ఓ సారి తన భర్త మసీద్‌కు తీసుకొచ్చాడని వివరించింది. ఆ మసీద్ చాలా ప్రశాంతంగా అనిపించిందని, అందుకే ప్రార్థనలు చేసుకోడానికి వచ్చానని చెప్పింది ఆ యువతి. ఆమె తరపున కోర్టులో వాదించిన న్యాయవాది కీలక వివరాలు వెల్లడించారు. వాదనలు విన్న తరవాత కోర్టు ఆమెకు రక్షణ కల్పించినట్టు చెప్పారు. మే 22న మరోసారి ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని కోర్టు చెప్పినట్టు తెలిపారు. హరిద్వార్‌లో ఉన్న దర్గాకు ఇతర మతాలకు చెందిన వాళ్లు కూడా వచ్చి ప్రార్థనలు చేసుకుంటారని కొందరు చెబుతున్నారు. 


హిందూ అమ్మాయి దత్తత


The Kerala Storyపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రశాంతంగా ఉన్న సొసైటీలో అలజడి రేపడం ఎందుకు..? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. ఇదంతా అవాస్తవం అని ముస్లిం సంఘాలు మండి పడుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు మత సామరస్యానికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు. విద్వేషాలు ప్రచారం చేయడమెందుకు అంటు ప్రశ్నిస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య ఏ ఆర్ రెహమాన్ ఓ వీడియో షేర్ చేశారు. ఇప్పుడు NCP లీడర్ జితేంద్ర అవ్హాద్ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ ఫోటో వెనకాల కథేంటో కూడా రాశారు. ప్రస్తుతం ఈ ఫోటో కూడా వైరల్ అవుతోంది. ముస్లిం జంట పదేళ్ల  హిందూ అమ్మాయిని దత్తత తీసుకుని బాగోగులు చూసుకుంది. ఏ లోటు రానివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆమెకు చదువు చెప్పించడమే కాదు. పెళ్లి కూడా ఘనంగా చేసింది. ప్రస్తుతం ఆ అమ్మాయి వయసు 22 ఏళ్లు. అయితే...ఆ అమ్మాయిని దత్తత తీసుకున్నాక పేరు మార్చారు. ఖాతిజా అని పేరు పెట్టారు. ఇప్పుడు అబ్దుల్లా అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. పూర్తిగా హిందూ సంప్రదాయ ప్రకారమే వివాహం ఘనంగా చేశారు. ఇదే విషయాన్ని ట్విటర్‌లో వివరించారు జితేంద్ర. ఎప్పుడూ నెగటివ్ వార్తలే ఎందుకు..? ఇలాంటి పాజిటివ్ సంగతుల గురించి కూడా మాట్లాడుకుందాం అంటూ ట్వీట్ చేశారు. హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లాడిన ఆ యువతి బుర్ఖాలో ఉన్న తన తల్లి కాళ్లకు దండం పెడుతున్న ఫోటో వైరల్ అవుతోంది.