Uttarakhand Uniform Civil Code: ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో Uniform Civil Code అమలు చేస్తామని చెబుతోంది. అందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గడువు ముగిసిన తరుణంలో మరో కీలక ప్రకటన చేసింది. 15 రోజుల పాటు ఈ గడువు పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 2వ తేదీన డ్రాఫ్ట్‌ని సమర్పించనుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ప్రకటన చేశారు. కొత్త ఓటర్లను ఉద్దేశిస్తూ మాట్లాడిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చినట్టు చెప్పారు. అంతే కాదు. యూసీసీపై కసరత్తు చేస్తున్నందునే అయోధ్య ట్రిప్‌ని కూడా రద్దు చేసుకున్నట్టు వివరించారు. జస్టిస్ రమణ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి నేటితో (జనవరి 26) గడువు ముగిసింది. ఇప్పటికే మూడు సార్లు ఈ కమిటీ గడువుని పొడిగించింది ప్రభుత్వం. ఐదుగుర సభ్యులతో కూడిన కమిటీ ఇప్పటికే UCCపై ఓ డ్రాఫ్ట్ తయారు చేసింది. ఆ ముసాయిదా చేతికి అందగానే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆ సమయంలోనే బిల్లుని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టు పుష్కర్ సింగ్ ధామీ వెల్లడించారు. ఆ తరవాత రాష్ట్రమంతటా ఈ కోడ్ అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పారు. విడాకులు, సహజీవనం, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్స్, బహుభార్యత్వం...ఇలా అన్ని అంశాలకూ ఈ కోడ్ వర్తించేలా చూస్తామని స్పష్టం చేశారు. వెనకబడిన వర్గాలకు న్యాయం చేయడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. 


ఉత్తరాఖండ్‌ తరవాత గుజరాత్‌లోనూ యునిఫామ్ సివిల్‌ కోడ్‌ని అమలు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. లోక్‌సభ ఎన్నికలకు ( Lok Sabha Elections 2024) ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంది. ఉత్తరాఖండ్‌లో యూసీసీకి లైన్ క్లియర్ అయితే...ఈ కోడ్‌ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించనుంది. ఈ యూసీసీతో పాటు బహుభార్యత్వంపై (Polygamy Ban) నిషేధం విధించే బిల్‌నీ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతే కాదు. లివిన్‌ రిలేషన్‌లో ఉన్న జంటలు కచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధనా తీసుకురానున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా మన దేశంలో ఒక్కో మతానికి ఒక్కో చట్టం ఉంటుంది. ఆయా మతాల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం కొన్ని చట్టాలను అనుసరిస్తుంటారు. హిజాబ్, ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలు ఈ కోవకు వస్తాయి. అయితే...Uniform Civil Code అమలు చేస్తే అన్ని మతాలు, వర్గాలకు ఒకే చట్టం అమలవుతుంది. అంటే...అందరికీ కలిపి ఉమ్మడి చట్టం. మతాల వారీగా చట్టాలు ఉండటం వల్ల న్యాయవ్యవస్థపై భారం పడుతోందన్నది కొందరి వాదన. ఈ సివిల్ కోడ్‌ అమల్లోకి వస్తే ఏళ్లుగా నలుగుతున్న కేసులకూ వెంటనే పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తున్నారు.


Also Read: Viral Video: రైల్వే ట్రాక్‌పై కూర్చుని తీరిగ్గా ముచ్చట్లు, వంటావార్పు కూడా - వైరల్ వీడియో