Azharuddin Decided to Resigned to Congress Party: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక ముస్లిం నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో పరాజయం పాలయ్యారు. సుమారు 16 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చి మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇస్తారని అజారుద్దీన్ ఆశించారు. ఈ మేరకు తన సన్నిహితులు వద్ద మనసులో మాటను చెప్పారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. అజారుద్దీన్‌కు కాకుండా అమీర్ ఆలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తిని సన్నిహితులు వద్ద వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల నుంచి ఉన్న తనకు కనీసం అవకాశం ఇవ్వకపోవడం దారుణమంటూ సన్నిహితులు వద్ద వాపోయినట్టు తెలిసింది.
ఆశలు ఆవిరి కావడంతో
సుమారు పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా ఎన్నికై మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కించుకోవచ్చని అజారుద్దీన్ భావించారు. దురదృష్టవశాత్తు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి రావాలంటే ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకోవాలని భావించారు. ఈ మేరకు పార్టీ అగ్రనాయకులు వద్ద తనకున్న పరిచయాలు ద్వారా ప్రయత్నాలు సాగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తి కాకముందు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్య కావడంతో తన కోరిక నెరవేరుతుందని అజారుద్దీన్ భావించారు. ఈ మేరకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలను సాగించారు. కానీ, అధిష్టానం తనకు కాకుండా మరో మైనార్టీ నేత అమీర్ ఆలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల అజారుద్దీన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తనకు కనీసం న్యాయం చేయని పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్లిపోవడం మంచిదని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. 18 ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన తనకు కాకుండా మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇస్తానని పార్టీ పెద్దలు తనకు హామీ ఇచ్చారని, కానీ ఇవ్వకుండా మోసం చేశారంటూ అజారుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా వేరే వాళ్లకు ఎమ్మెల్సీలుగా ఎలా అవకాశం కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. అజారుద్దీన్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముసలానికి దారి తీసే అవకాశముందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలా చల్లారుస్తారో చూడాల్సి ఉంది.