అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రెండు ప్రధాన కులాలు ఎన్నికల ఫలితాలను శాసిస్తున్నాయి.. పార్టీలు ఏవైనా కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాల మధ్యనే పోటీగా ఇక్కడ పరిస్థితి మారుతుంటుంది.. ఈనేపథ్యంలోనే ఇక్కడ ఇంతవరకు నెగ్గిన నేతల సామాజికవర్గాలు ఇవే కులాలు కావడం గమనించదగ్గ విషయం కాగా రెండుసార్లు స్వతంత్రులుగా పోటీచేసి నెగ్గిన నేపథ్యం కూడా ఈ నియోజవర్గానికి ఉంది.. అయితే ఇక్కడ ఎప్పుడూ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మధ్య పోటీ రసవత్తరంగా సాగిన పరిస్థితి ఉండేది.. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా రాజోలు ప్రాంతానికి చెందిన మాజీ జడ్పీ ఛైర్మన్, ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం బరిలో నిలిపింది వైసీపీ అధిష్టానం. టీడీపీ నుంచి పోటీచేసిన ప్రత్యర్ధి తోట త్రిమూర్తులు ఓటమి పాలయ్యారు. అయితే తర్వాత తోటు త్రిమూర్తులు వైసీపీలో చేరారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్, తోట త్రిమూర్తులు ఇద్దరూ ఒకే గూటికి చేరడంతో టీడీపీకు రామచంద్రపురంలో అభ్యర్ధే దొరకని పరిస్థితి ఎదురైంది..
తోటను మండపేటకు పంపిన వైసీపీ..
రామచంద్రపురం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడంతో ఆయనకు వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.. అయితే ఆయన 1994లో తొలిసారిగా స్వతంత్య్ర అభ్యర్ధిగా బరిలో దిగి విజయం సాధించారు. ఆ తరువాత తెలుగుదేశంలో చేరిన త్రిమూర్తులు 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి గెలుపొందారు. 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన సుభాష్ చంద్రబోస్ విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సుభాష్ చంద్రబోస్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో రామచంద్రపురంలో ఉపఎన్నిక షురూ అయ్యింది.. 2012లో జరిగిన ఈ ఉప ఎన్నికలో టీడీపీ తరపున తోట త్రిమూర్తులు పోటీచేయగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన నూతన పార్టీ వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీచేశారు. ఈ ఎన్నికలో 11,919ఓట్లు ఆధిక్యంతో తోట త్రిమూర్తులు గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పోటీచేయగా ప్రత్యర్ధిగా వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీచేశారు. మళ్లీ తోట త్రిమూర్తులు విజయకేతనం ఎగురవేశారు. 2019 ఎన్నికల్లో ఈసారి పిల్లి ను మండపేట పంపించిన వైసీపీ అధిష్టానం రామచంద్రపురంకు ఈసారి రాజోలుకు చెందిన మాజీ జడ్పీ ఛైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను బరిలో దింపింది. ఈ ఎన్నికల్లో వేణు 5168 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు..
ఈసారి పిల్లి కుమారుడు బరిలో దింపిన వైసీపీ..
వైసీపీలో సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు మంత్రి వేణుగోపాలకృష్ణకు మధ్య విభేధాలు తారాస్థాయికి రావడంతో ఒక దశలో పార్టీకు అవసరమైతే రాజినామా చేస్తానని పిల్లి హెచ్చరించారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధిష్టానం రామచంద్రపురం నియోజకవర్గానికి పిల్లి కుమారుడు సూర్యప్రకాశ్‌ను నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించి మంత్రి వేణును రాజమండ్రి రూరల్‌కు పంపించింది.. ఇదిలా ఉంటే టీడీపీ తరపున శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ ఇక్కడ కొత్త అభ్యర్ధిని బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే శెట్టిబలిజ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు వాసంశెట్టి సుభాష్‌చంద్రబోస్‌ను బరిలో దింపేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది..