Kamala Harris On Diwali:


హ్యాపీ దీపావళి..


అమెరికా వైస్‌ ప్రెసిడెంట్ కమలా హారిస్ దీపావళి పండుగతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "దీపావళి పండుగ భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. అది అన్ని దేశాల సంస్కృతులకూ వర్తిస్తుంది" అని అన్నారు. తన అధికార నివాసంలోనే దీపావళి వేడుకలు ప్రారంభించారు. "హ్యాపీ దీపావళి" అంటూ కాకరొత్తులు కాల్చుతూ సందడి చేశారు. ఆమె ఇంటిని ఇప్పటికే దీపాలతో అలంకరించారు. ఎంతో మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్ స్వీట్స్‌తో పాటు మరి కొన్ని స్పెషల్ ఐటమ్స్‌ని వారికి సర్వ్ చేశారు. వీటిలో పానీ పూరి కూడా ఉండటం విశేషం. "చీకటిపై వెలుగు సాధించే విజయాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. చీకటి ఉన్న ప్రతి చోట వెలుగులు ప్రసరించాలి" అని ఆమె వ్యాఖ్యానించారు. 100 మందికిపై ఇండియన్ అమెరికన్స్‌ ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. "ఓ వైస్ ప్రెసిడెంట్‌గా నేనెప్పుడూ ఒకే విషయం ఆలోచిస్తాను. మనకు మన దేశంలో కావచ్చు. ఇతర దేశాల్లో అయుండొచ్చు. సవాళ్లు ఎదురు కాకపోతే మనం ముందుకు వెళ్లలేం. చీకట్లో ఉన్నప్పుడు వెలుగులు నింపుకునే శక్తిని ఎలా సంపాదించాలో దీపావళి లాంటి పండుగలు మనకు నేర్పుతాయి" అని కమలా హేరిస్ చెప్పారు.






అతిథులందరికీ స్వాగతం పలుకుతూ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అంతకు ముందు డ్సాన్స్ ప్రోగ్రామ్‌లు కూడా ఏర్పాటు చేశారు. జయహో, ఓం శాంతి లాంటి బాలీవుడ్ హిట్‌ పాటలకు యువతీ, యువకులు స్టెప్‌లేశారు. ఈ సందర్భంగా చెన్నైలో తన బాల్యంలో దీపావళి ఎలా జరుపుకునేవారో గుర్తు చేసుకున్నారు కమలా. "వెలుగు, చీకటిని బ్యాలెన్స్ చేసుకోవాలనే తత్వాన్ని బోధిస్తుంది దీపావళి. ఎన్నో ఏళ్లుగా ఈ ఆనవాయితీ వస్తోంది. మనల్ని చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చేదేమిటో తెలుసుకోవటానికీ ఈ పండుగ సహకరిస్తుంది" అని అన్నారు. ఎన్నో ఏళ్లుగా మనల్ని విడదీయటానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న హేరిస్, ఇప్పటికీ కొందరు ప్రజాస్వామ్య విధానాలను వ్యతిరేకిస్తున్నారని...స్వేచ్ఛను హరించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. 


భారత్‌తో సత్సంబంధాలపై..


కమలా హారిస్.. భారత్- అమెరికా సంబంధాలపై గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్.. అమెరికాకు ఓ ముఖ్యమైన భాగస్వామి అని అభివర్ణించారు. కరోనాపై పోరులో ఇరు దేశాలు అందిపుచ్చుకున్న సహాయసహకారాలను ప్రస్తావించారు. 
" అమెరికాకు భారత్ ఓ ముఖ్యమైన భాగస్వామి. భారత్‌లో కరోనా విజృంభించిన సమయంలో ఆపన్నహస్తం అందించినందుకు అమెరికా గర్వపడుతోంది. వ్యాక్సినేషన్‌లో భారత్ చూపిస్తోన్న చొరవ బాధ్యతాయుతంగా ఉంది. రోజుకు దాదాపు కోటి మందికి భారత్ వ్యాక్సిన్ అందించగలగడం నిజంగా ప్రశంసనీయం. "


                      -కమలా హారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలు


Also Read: UK Political Crisis: మళ్లీ మొదలైన బ్రిటన్ ప్రధాని రేస్, ఈ సారైనా రిషి సునాక్‌ గెలుస్తారా?