UK Political Crisis:


జాన్సన్ వర్సెస్ సునాక్ 


బ్రిటన్‌లో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ప్రధాని పదవిని చేపట్టిన 45 రోజుల్లోనే లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఇప్పుడు మరోసారి ప్రధాని రేసు మొదలైంది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ మరోసారి ఈ రేసులోకి వచ్చారు. కన్జర్వేటివ్‌ సభ్యుల్లో దాదాపు 100 మంది ఆయనకు ఇప్పుడు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రధాని రేసులో పోటీ చేయాలంటే కచ్చితంగా 100 మంది సభ్యుల మద్దతు అవసరం. అలా చూస్తే...రిషి సునాక్‌ ఆ అర్హత సాధించినట్టే. 93 మంది సభ్యులు ఆయన వైపు ఉన్నారని మొదట అనుకున్నా...బ్యాలెట్‌ పేపర్‌ పరంగా చూస్తే ఆ సంఖ్య 100 వరకూ చేరినట్టు సమాచారం. లిజ్‌ ట్రస్ కన్నా ముందు బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ కూడా ఇప్పుడు ప్రధాని రేసులోకి వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 44 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇన్నాళ్లూ కరేబియాలో ఉన్న ఆయన...ఈ పోటీ నేపథ్యంలో మళ్లీ బ్రిటన్‌కు వచ్చేశారు. అంటే...ఈ సారి పోటీ సునాక్, జాన్సన్ మధ్య ఉండనుంది. ఇద్దరూ అధికారికంగా ఇంకా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించలేదు. అటు పెన్నీ మొర్డాంట్‌ కూడా ప్రధాని రేసులో ఉన్నారు. 21 మంది సభ్యుల సపోర్ట్‌తో ఆమె ఈ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అటు జాన్సన్ మద్దతుదారులు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు. " ఈ రేసులో గెలిచేది బోరిస్ జాన్సనే" అని తేల్చి చెబుతున్నారు. 
సీనియర్ సభ్యులు, మాజీ ఛాన్స్‌లర్, హెల్త్ సెక్రటరీ సాజిద్ వాజిద్, భద్రతా మంత్రి టామ్ టుగెంధట్...,బోరిస్ జాన్సన్‌కు మద్దతునిస్తున్నారు. 


లిజ్ ట్రస్ రాజీనామా..


బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజులకే ఆ పదవికి రాజీనామా చేశారు లిజ్ ట్రస్. రాజకీయ సంక్షోభానికి తెర దించుతారని భావిస్తే...ఆమె వచ్చాక కూడా అదే అనిశ్చితి కొనసాగింది. సంపన్నుల పన్ను కోత విషయంలో ఆమె మాట తప్పడం, మినీ బడ్జెట్‌ విషయంలో విమర్శలు రావటం లాంటి పరిణామాలు ఆమెకు రాజీనామా తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేశాయి. అత్యంత తక్కువ కాలం పాటు పదవిలో ఉన్న ప్రధానిగానూ ఆమె చరిత్రలో నిలిచిపోయారు. ఇంత తొందరగా...ఆమె పదవి నుంచి దిగిపోవటానికి ఎన్నో కారణాలున్నాయి. లిజ్ ట్రస్‌ చేసిన ప్రధాన తప్పిదం "సంపన్నులకు పన్ను తగ్గించటం". ఇందుకోసం 45 బిలియన్ డాలర్ల ప్యాకేజ్ ప్రకటించారు. అప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతం అవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను ఇది ఇంకాస్త గండి కొట్టింది. ఎలాంటి ఆలోచన చేయకుండా...నిర్ణయం తీసేసుకున్నారు ట్రస్. ఫలితంగా...మార్కెట్‌లో పెద్ద కలకలం రేగింది. తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఫలితంగా...ఆమె ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అనాలోచితంగా పన్ను కోత విధించటం వల్ల ఉన్నట్టుండి పౌండ్ విలువ పడిపోయింది. డాలర్‌తో పోల్చి చూస్తే...ఎన్నడూ లేనంతగా విలువ తగ్గిపోయింది.


వెంటనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్పందించి అప్రమత్తం చేసింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలక ముందే మేలుకోవాలని హెచ్చరించింది. ప్రతిపక్షాలను ఏ మాత్రం సంప్రదించకుండానే..తన సన్నిహితులను కీలక పదవుల్లో నియమించుకున్నారు లిజ్ ట్రస్. నియామకాలన్నీ ఆమె చెప్పినట్టే జరగాలన్న కండీషన్ కూడా పెట్టారు. ఇది క్రమంగా ఆగ్రహానికి దారి తీసింది. అప్పటి వరకూ పార్టీకి విధేయులుగా ఉన్న వాళ్లు, పదవి ఆశించిన వాళ్లు ఈ నిర్ణయంతో అవమానంగా ఫీల్ అయ్యారు. ఒకేసారి 100 మంది ఎంపీలు ఆమెకు ఎదురు తిరిగారు. ఆమె పదవి నుంచి తప్పుకోవాలంటూ లేఖ రాశారు. 


Also Read: Pakistan FATF Grey List: ఇన్నాళ్లకు తీరనున్న పాకిస్థాన్ కష్టాలు, ఆ లిస్ట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం