బరువు తగ్గడం కష్టమేమో కానీ అసాధ్యం మాత్రం కాదు. సరిగా డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకుని క్రమశిక్షణతో ఫాలో అయితే మీరు పెట్టుకున్న గడువులోగా బరువు తగ్గడం ఖాయం. వాటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చెయ్యాలి. మనం తీసుకునే ఆహారం వ్యాయామానికి అనుగుణంగా ఉండాలి. సమతుల్య ఆహారం సరైన నిష్పత్తిలో తీసుకున్నప్పుడే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం సాధ్యం అవుతుంది. ఇందులో భాగంగానే పరగడుపున నీళ్ళు తాగడం పచ్చి కూరగాయ ముక్కలు తీసుకోవడం వంటివి చేస్తూనే ఉంటారు. ఇవే కాదు మరికొన్ని అద్భుతమైన ఫుడ్స్ తీసుకున్నా కూడా మీ బరువు తగ్గించుకోవడం సులభం అవుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..
మఖానా
బహుశా తామర గింజలు అంటే ఎవరికి తెలియదేమో కానీ మఖానా అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. శరీరంలోని అదనపు కొవ్వులని కాల్చడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. క్రమం తప్పకుండా దీన్ని తీసుకోవడం వాళ్ళ ఆరోగ్యమే కాదు అందం కూడా మీ సొంతం అవుతుంది. ఎముకలకి బలాన్ని ఇచ్చే కాల్షియం ఇందులో పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల యాంటీ ఏజింగ్ గా పని చేస్తుంది. చర్మం యవ్వనంగా ఉండేలా చూస్తుంది. అంతే కాదు మధుమేహులకి ఇది మంచిదే. గ్లైసిమిక్ ఇండెక్స్ లో తక్కువ చక్కెర కంటెంట్ ఉన్న పదార్థం. అందువల్ల మధుమేహులు కూడా ఎటువంటి భయాలు లేకుండా దీన్ని తీసుకోవచ్చు.
పసుపు
అందం, ఆరోగ్యం ఇవ్వడంలో పసుపు తర్వాతే దేని స్థానం అయినా. పసుపు టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో పిత్త ఉత్పత్తి తగ్గుతుంది. కొవ్వుని కరిగించి జీవక్రియకి సహాయపడుతుంది. పసుపుని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. పసుపుని సూపర్ ఫుడ్ గా మార్చే ప్రధాన మూలకం కర్కుమిన్. నొప్పి, గాయాలని నయం చేయడం నుంచి రోగ నిరోధక శక్తిని పెంచే వరకి ఇది ఉపయోగపడుతుంది.
జామకాయ
అన్నీ సీజన్లలో అందుబాటులో ఉండేది జామకాయ. విటమిన్ సి అనగానే నారింజ అని అంటారు కానీ నిజానికి అందులో కంటే జామకాయలో ఎక్కువగా సి విటమిన్ లభిస్తుంది. కొవ్వుని కరిగించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. జామపండు తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. దాని వల్ల భోజనం తక్కువగా తీసుకుంటారు. అందుకే బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు తప్పనిసరిగా తమ డైట్లో జామకాయ ఉండేలా చూసుకుంటే చాలా మంచిది. మధుమేహులకి కూడా మేలే చేస్తుంది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)లో తక్కువ స్థాయిని పొందింది. ఇది త్వరగా జీర్ణం అయ్యే ఆహారం. కేలరీలు తక్కువగా ఉండే ఆహారం .
స్వీట్ పొటాటో
విటమిన్ ఏ, సి, బి, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు తీపి బంగాళాదుంపలో పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆకలిని తగ్గిస్తాయి. వీటిని డైట్లో చేర్చుకుంటే బరువు తగ్గేందుకు మాత్రమే కాదు కొవ్వు తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. దీన్ని ఆహారంలో సైడ్ డిష్ లేదా స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఎంతో రుచికరంగాను ఉంటుంది.
వాల్ నట్స్
బరువు తగ్గించేందుకు ఉపయోగపడే సూపర్ ఫుడ్స్ లో వాల్ నట్స్ ఒకటి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఆకలిని నియంత్రించే గుణాలు కలిగి ఉంటాయి. రాత్రంతా నానబెట్టుకుని ఉదయం పరగడుపున వీటిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వాల్ నట్స్ గుండెని ఆరోగ్యంగా ఉంచి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కొవ్వును కరిగించి ఆరోగ్యకరంగా బరువుని తగ్గించడంలో సహాయపడతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: ఈ మ్యాజిక్ బ్రేక్ ఫాస్ట్‌తో మధుమేహం, ఊబకాయం మటాష్!