US Mass Shooting: కాల్పులతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. తాజాగా మిసిసిపీలో సామూహిక కాల్పుల ఘటన వెలుగు చూసింది. శుక్రవారం (ఫిబ్రవరి 17) రూరల్ అర్కబుట్ల కౌంటీలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ముందుగా ఓ దుకాణం వద్ద కాల్పులు జరిపిన దుండగుడు అనంతరం ఇతర ప్రాంతాల్లో కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులకు పాల్పడిని ఓ వ్యక్తిని ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు. మిసిసిపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు చెందిన మార్టిన్ బెయిలీ దర్యాప్తులో సహాయం చేస్తున్నట్లు చెప్పారు.
మిసిసిపీ గవర్నర్ ఏం చెప్పారంటే..?
కాల్పుల ఘటనకు కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు మిసిసిపీ గవర్నర్ టేట్ రీవ్స్ ట్వీట్ చేశారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఒంటరిగానే ఈ దాడికి పాల్పడినట్లు తాను నమ్ముతున్నానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే నిందితుడు కాల్పులకు ఎందుకు పాల్పడనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదని వివరించారు. అయయితే దర్యాప్తు కొనసాగిస్తున్నామని వివరించారు.
కాల్పుల్లో ఆరుగురు మృతి..
ఆర్కబుట్ల కమ్యూనిటీ పరిధిలో కాల్పులు జరిగాయని టేట్ కౌంటీ షెరీఫ్ బ్రాడ్ లాన్స్ తెలిపారు. ఆర్కబుట్ల రోడ్డులోని ఓ దుకాణంలో తొలి కాల్పుల ఘటన చోటుచేసుకుందని, అక్కడే ఓ వ్యక్తి కాల్చి చంపబడ్డాడని ఆయన చెప్పారు. ఆర్కబుట్ల ఆనకట్ట రోడ్డులోని ఓ ఇంట్లో మహిళ కూడా మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె భర్తకు గాయాలు అయ్యాయి. అయితే అతనిపై కాల్పులు జరిపారా లేదా అనేది స్పష్టంగా తెలియ రాలేదు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు చనిపోయారు.
వారం రోజుల క్రితం కూడా కాల్పులు
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికా వ్యాప్తంగా ఏదో ఒక చోట తరచూ గన్ ఫైర్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 10వ తేదీనాడు యూఎస్ ఈస్ట్ లాన్సింగ్ లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడు వెంట తెచ్చుకున్న గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు.
గన్‌తో ఇష్టారీతిగా కాల్పులు
సోమవారం రాత్రి 8.30 గంటలకు విశ్వవిద్యాలయంలోకి దుండగుడు ప్రవేశించాడు. క్యాంపస్ లోని రెండు భవనాల వద్ద కాల్పులకు తెగబడ్డాడు. ఆగంతుడి దుశ్చర్యతో భయాందోళనకు గురైన విద్యార్థులు, క్యాంపస్ సిబ్బంది అక్కడి నుండి పారిపోయారు. కాల్పులు జరిపిన ఆ తర్వాత నిందితుడు అక్కడి నుండి వెళ్లిపోయాడని సిబ్బంది తెలిపారు. ఆంగతకుడు నార్త్ వైపు ఉన్న ఎంఎస్‌యూ యూనియన్ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు విద్యార్థులు, సిబ్బంది వెల్లడించారు.
నల్లజాతీయుడిగా అనుమానం
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులకు తెగబడ్డ ఆగంతుకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్యాంపస్ లోని రెండు భవనాల లోపలకాల్పులు జరిపినట్లు భావిస్తున్న నిందితుడి గురించిన ఫోటోలను, సమాచారాన్ని పోలీసులు విడుదల చేశారు. అనుమానితుడు నల్లజాతీయుడని, పొట్టిగా ఉంటాడని, ఎరుపు రంగు బూట్లు, జీన్ జాకెట్ ధరించాడని, క్యాప్ పెట్టుకున్నాడని వెల్లడించారు. అతని ఫోటోలను మీడియాకు విడుదల చేశారు.