Adani-Hindenburg Case: అదానీ గ్రూప్‌-హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కేసులో కేంద్ర ప్రభుత్వం పప్పులు ఉడకలేదు. ఈ ఉదంతంపై నిపుణుల కమిటీ సభ్యుల పేర్లను సీల్డ్‌ కవర్‌లో కేంద్ర సమర్పించగా, సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది. రహస్యం పాటించాల్సిన అవసరం ఏంటని శుక్రవారం (17 ఫిబ్రవరి 2023) జరిగిన విచారణలో సొలిసిటర్‌ జనరల్‌ను ప్రశ్నించింది.


కేంద్ర ప్రభుత్వం రహస్యంగా, సీల్డ్‌ కవర్‌లో సమర్పించిన నిపుణుల పేర్లతో కూడిన కమిటీ నియామకాన్ని తాము ఆమోదిస్తే ప్రజల్లోకి తప్పుడు అభిప్రాయం వెళ్తుందని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. సీల్డ్‌ కవర్‌లోని నిపుణుల కమిటీని ఆమోదిస్తే అది కేంద్ర ప్రభుత్వ కమిటీ అన్న భావన మాత్రమే ప్రజల్లో ఉంటుందని, ఒక స్వతంత్ర కమిటీ అన్న అభిప్రాయం కలగదని తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ‍‌(Chief Justice D Y Chandrachud) నేతృత్వంలో, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఈ కేసులో విచారణ జరుగుతోంది. స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదార్ల ప్రయోజనాలను కాపాడాలని తాము సంపూర్ణంగా కోరుకుంటున్నామని, విచారణలో పారదర్శకత ఉందన్న అభిప్రాయం ప్రజలకు కలగాలని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. కాబట్టి, స్టాక్‌మార్కెట్ల నియంత్రణను మరింత బలోపేతం చేసే సూచనల కోసం, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచడానికి తామే సొంతంగా నిపుణుల కమిటీని నియమిస్తామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అదానీ గ్రూప్‌-హిండెన్‌బర్గ్‌ వివాదం కేసులో నియమించబోయే కమిటీ పని తీరును పర్యవేక్షించేందుకు సిట్టింగ్‌ జడ్జిని నియమించేది లేదని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. 


అదానీ గ్రూప్‌ కంపెనీలపై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు నాలుగు పిటిషన్ల దాఖలు కాగా, వాటన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. కేంద్రం ప్రభుత్వం, సెబీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విచారణకు హాజరయ్యారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రభావం స్టాక్‌ మార్కెట్‌పై ఉండదని సెబీ సుప్రీంకోర్టుకు తెలపగా... అదే నిజమైతే, నివేదిక వచ్చిన తర్వాత స్టాక్‌ మార్కెట్‌ పతనమైందని, ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలు ఎలా నష్టపోయారని ధర్మాసనం ప్రశ్నించింది. వీలైనంత త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టును తుషార్‌ మెహతా కోరారు.


అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదంపై విచారణకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమని కొన్ని రోజుల క్రితం జరిగిన విచారణలో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. ఆ మేరకు, సీల్డ్‌ కవర్‌లో నిపుణుల కమిటీ సభ్యుల పేర్లు, కమిటీ పరిధి, విధులు, విధానాల వివరాలు ఉన్న ఒక సీల్డ్‌ కవర్‌ను బుధవారం సాయంత్రం సుప్రీంకోర్టుకు అందించారు. ఆ సీల్డ్‌ కవర్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ప్రభుత్వ సూచనలను అంగీకరించడం లేదని స్పష్టంగా చెప్పింది. 


పిటిషన్లు వేసిన పిటిషన్‌దార్లు, ఈ కేసులో విచారణ విషయంలో కొన్ని విజ్ఞప్తులు, సిఫార్సులు చేశారు. సుప్రీంకోర్టు వాటన్నింటినీ తిరస్కరించింది. 


అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, 2023 జనవరి 24వ తేదీన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) ఘాటైన నివేదిక రిలీజ్‌ చేసిన తర్వాత షేర్‌ మార్కెట్‌ షేక్‌ అయింది. అమెరికన్ షార్ట్ సెల్లర్ చేసిన అకౌంటింగ్ మోసం & స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ, అదానీ సామ్రాజ్యం విలువ సుమారు 120 బిలియన్‌ డాలర్ల పైగా తుడిచి పెట్టుకుపోయింది, సగానికి సగం తగ్గింది. ఒక్క అదానీ స్టాక్స్‌ ‍‌(Adani Group Stocks) మాత్రమే కాకుండా మొత్తం స్టాక్‌ మార్కెట్‌ కూడా భారీగా నష్టపోయింది. ఇన్వెస్టర్లు లక్షల కోట్ల సంపద కోల్పోయారు.