US Gun Death Rate:
మూడు దశాబ్దాల రికార్డు..
అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో పాతుకుపోయిందో ఇటీవలి ఘటనలే స్పష్టం చేస్తున్నాయి. ఉన్నట్టుండి జేబులో నుంచి తుపాకీ తీసి ఇష్టమొచ్చినట్టు కాల్చి పడేస్తున్నారు చాలా మంది. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్నారులూ ఉంటున్నారు. ఒక్కోసారి స్కూల్స్‌పైనా దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే వారం రోజులకో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణనష్టమూ భారీగానే నమోదైంది. ఈ ఘటనలపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి...ఓ రిపోర్ట్ విడుదల చేసింది JAMA Network Open మెడికల్ జర్నల్. గతేడాది అమెరికాలో కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యగా రికార్డు స్థాయిలో నమోదైందని వెల్లడించింది. మూడు దశాబ్దాల రికార్డుని చెరిపేసిందని తేల్చి చెప్పింది. ఈ కాల్పుల ఘటనల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా చనిపోతున్నారని తెలిపింది. 1990 నుంచి 2021 వరకూ అమెరికాలో 11 లక్షల 10 వేల 421 మంది తూటాలకు బలి అయ్యారని The Hill రిపోర్ట్ వెల్లడించింది. మహిళలు ఎక్కువగా బాధితులవుతుండగా..వీరిలో నల్లజాతికి చెందిన మహిళలనే ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. 2010తో పోల్చితే...కాల్పుల ఘటనల్లో ప్రాణాలు కోల్పోయే మహిళ మూడు రెట్ల కన్నా ఎక్కువగా పెరిగింది. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళల సంఖ్య 2015తో పోల్చుకుంటే డబుల్ అయింది. గన్ వయలెన్స్ ద్వారా చనిపోతున్న వారిలో 14% మహిళలే ఉంటున్నారు. గతేడాది లెక్కలు చూస్తే..ప్రతి లక్ష మంది అమెరికన్ మహిళలకు ఏడుగురు తుపాకీ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2010లో ఈ సంఖ్య 4గా ఉంది.
దారి తప్పిన గన్ కల్చర్..
1775 నుంచే అమెరికా సంస్కృతిలో భాగమైపోయాయి తుపాకులు. ఆఫ్రికన్ అమెరికన్లను బానిసలుగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో అమెరికన్లు తుపాకులు వినియోగించటం మొదలు పెట్టారు. రానురాను తుపాకి అనేది అమెరికా జాతి చిహ్నంగా మారిపోయింది. ఇక్కడే మరో అంశమూ ప్రస్తావించాలి. 1776లో ఇంగ్లాండ్‌తో పోరాటం చేసి స్వాతంత్య్రం సంపాదించుకుంది అమెరికా. ఆ సమయంలో అమెరికన్లు తమ భద్రత కోసం తుపాకులు పట్టుకుని తిరిగేవారు. "స్వీయరక్షణ" అనే కారణాన్ని చూపిస్తూ ఇప్పటికీ చాలా మంది లైసెన్స్‌డ్ గన్స్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. రెండు దశాబ్దాల్లో అమెరికాలో సుమారు 20 కోట్ల తుపాకులు అమ్ముడైనట్టు అంచనా. మొదట్లో భద్రత కోసం తుపాకి ఉంటే మంచిదని భావించిన అమెరికన్ల సంఖ్య కాస్త తక్కువగానే ఉండేది. రానురాను ఇది ప్రెస్టేజ్ సింబల్‌గా మారింది. చేతిలో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండటాన్ని హోదాగా భావించే ధోరణి పెరిగింది. ఫలితంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా తుపాకీ కొనుగోలు చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే గన్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనుకునే వారి సంఖ్య పెరగటం వల్ల క్రమంగా గన్ కల్చర్ దారి తప్పింది. ప్రస్తుతం అమెరికాలో గన్ కల్చర్ 2.0 నడుస్తోందని అంటున్నారంతా.