India-US Military Drills: 


ఎల్‌ఏసీకి సమీపంలో యుద్ధ్ అభ్యాస్..


వాస్తవాధీన రేఖ (LAC) వద్ద భారత్‌, అమెరికా సైన్యాలు సంయుక్తంగా మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో LACకి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో ఈ "యుద్ధ్ అభ్యాస్" కొనసాగుతోంది. దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. ఇండియా-యూఎస్ మిలిటరీ విన్యాసాలను ఖండించింది. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని మండి పడింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధులు...ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. "ఎల్‌ఏసీ సమీపంలో జరుగుతున్న ఈ విన్యాసాలు...1993,1996లో ఇరు దేశాల మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పంద స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి" అని విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ అన్నారు. ఇలాంటివి ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాన్ని చెరిపేస్తాయని విమర్శించారు. దాదాపు రెండేళ్లుగా భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. గల్వాన్ ఘటన తరవాత...ఇది తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికీ ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమంటూ రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారులు యుద్ధ సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో...అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు చేయడం ఉత్కంఠను పెంచుతోంది. చైనాను పరోక్షంగా హెచ్చరించేందుకు భారత్‌ ఈ వ్యూహంతో ముందుకెళ్తోందా అన్న వాదనా వినిపిస్తోంది. దాదాపు 15 రోజుల పాటు ఈ విన్యాసాలు జరగనున్నాయి. సైన్య వ్యూహాలను ఇరు దేశాలూ ఇచ్చి పుచ్చుకుంటాయి. విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి..?  అనేదీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. 






ఎప్పుడు ఏం జరుగుతుందో..


డ్రాగన్‌కు గట్టి బదులు చెప్తామని భారత్ ముందు నుంచి చెబుతూనే ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అందుకు ఇండియా రెడీ అవుతున్నట్టే అనిపిస్తోంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ కమాండర్లను హుటాహుటిన పిలిచి మీటింగ్ పెట్టారు. తూర్పు లద్దాఖ్ వద్ద ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అత్యున్న స్థాయిలో అన్ని వ్యూహాలూ సిద్ధం చేసుకోవాలని సూచించారు. మిలిటరీ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారు రాజ్‌నాథ్ సింగ్. దేశ భద్రతకు కట్టుబడి ఉన్న సైనికులందరికీ కితాబునిచ్చారు. "భారత సైన్యంపై, వారి నాయకత్వంపై మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఎలాంటి ఆపరేషన్లు చేపట్టేందుకైనా మనం సిద్ధంగా ఉండాలి" అన్నారు రాజ్‌నాథ్. ఇదే సమయంలో ఉగ్రవాదంపై పోరాడుతున్న సైన్యం నిబద్ధతను పొగిడారు. ఆత్మనిర్భరత సాధించేందుకు అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకోవటాన్నీ ప్రశంసించారు. ఐదు రోజుల పాటు మిలిటరీ కమాండర్ కాన్ఫరెన్స్‌ జరగనుంది. నవంబర్ 11న ముగియనుంది. ప్రస్తుత భద్రతా వ్యవస్థలో ఎదుర్కొంటున్న సవాళ్లపైనా ఈ సమావేశంలో చర్చించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవలే చైనా ఆర్మీకి చెందిన జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌ని సందర్శించారు. ఆ సందర్భంగా "సైన్యానికి శిక్షణ కఠినతరం చేయండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి" అని అక్కడి ఉన్నతాధికారులకు సూచించారు. సైన్యం అంతా ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. 


Also Read: Gujarat Elections: యూసీసీ అమలు చేయాల్సిన సమయం వచ్చేసింది - రాజ్‌నాథ్ సింగ్